Monday, January 20, 2025

కాంగ్రెస్ సర్కార్‌ను చీల్చి చెండాడుతాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది.
అందరినీ వెన్నుపోటు పొడిచింది.
రాష్ట్ర బడ్జెట్‌పై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఫైర్
ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని, అందరినీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ మీడియా వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి కెసిఆర్ 2024 -25 రాష్ట్ర బడ్జెట్‌పై స్పందించారు. బడ్జెట్‌లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదని, గొర్రెల పంపిణీ పథకం, దళితబంధు, రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపులే లేవు అని పేర్కొన్నారు.

రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని అన్నారు. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకుండా ప్రభుత్వం యాదవుల గొంతు కోసిందన్నారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కథ చెప్పినట్లే ఉంది తప్ప.. బడ్జెట్ పెట్టినట్లు లేదు అని విమర్శించారు. తాము వ్యవసాయ స్థిరీకరణ కోసం రెండు పంటలకు రైతుబంధు ఇస్తే వీళ్ల అవగాహనలేమి వల్ల దానిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదు..ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదు…ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదని అన్నారు. మహిళలకూ ఇచ్చిందేమి లేదని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజా సమస్యలపై బిఆర్‌ఎస్ శ్రేణులు పోరడతారని వెల్లడించారు. కాంగ్రెస్ మోసపూరిత ఎన్నికల వాగ్ధానాలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు ఎగ్గోడతామంటున్నారని మండిపడ్డారు. గొర్రెల పంపిణీ ఊసే లేదని, దళిత బంధు ప్రస్తావనే లేకుండా దళితులను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విధానమంటూ లేదన్నారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలనే తాను అసెంబ్లీకి పెద్దగా రాలేదని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని తాము పెద్దగా ప్రశ్నించలేదని, కానీ ఈ 6 నెలల్లో ప్రభుత్వం, రాష్టానికి సంబంధించి ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేయలేదని విమర్శించారు. భట్టి అంకెలను ఒత్తి పలకడం తప్పా చేసింది ఏమీలేదని ఎద్దేవాచేశారు. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని తమ ఎంఎల్‌ఎలు అడిగినా స్పందనలేదని మండిపడ్డారు. ఇది ఎవరి బడ్జెటో రానున్న రోజుల్లో చెబుతామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో మత్స్యకారులకు భరోసా లేదని ఎద్దేవా చేశారు. కొత్తగా ప్రస్తావించింది ఏమీ లేదని తెలిపారు. మహిళలకు ఇస్తానన్న రుణాలు ఎప్పటి నుండో ఉన్న పథకమే.. వీళ్లు ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. కొత్తగా సంక్షేమ పథకాలు లేవు, మహిళలకు కేటాయుంపుల పట్ల స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేదని పేర్కొన్నారు.

తొలిసారి ప్రతిపక్ష నేతగా హాజరైన కెసిఆర్
మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కెసిఆర్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కెసిఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కెసిఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం బాత్‌రూమ్‌లో కాలు జారిపడటంతో కెసిఆర్‌కు తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బిఆర్‌ఎస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత కెసిఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎంఎల్‌ఎగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కెసిఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కెసిఆర్ ఖచ్చితంగా వస్తారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు స్పష్టం చేశారు. అసలు కెసిఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?… లేదా..? అనే దానిపై ఇంతకాలం సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కెసిఆర్ గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News