Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ పాపాలు.. గ్యారెంటీలకు శాపాలు

- Advertisement -
- Advertisement -

వడ్డీలు చెల్లించడానికే
మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది
రుణభారం వల్లనే సంక్షేమ
పథకాల అమలులో ఇబ్బందులు
బిఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు
పేరిట యథేచ్ఛగా దోపిడీ
మీలా రాళ్లు, గుట్టలు, జాతీయ
రహదారులకు రైతుభరోసా
ఇవ్వాలా? నకిలీ పట్టాలతో
బిఆర్‌ఎస్ వాళ్లకు రైతుబంధు
రూ.22,606 కోట్లు అనర్హులకు
అప్పనంగా అందించిన గత
ప్రభుత్వం రైతు భరోసాపై
జరిగిన చర్చలో
సిఎం రేవంత్ రెడ్డి అబద్ధాల
సంఘానికి అధ్యక్షుడు కెసిఆర్
రాలేదంటూ వ్యంగ్యాస్ర్తం

మన తెలంగాణ/హైదరాబాద్: ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మీరు కారణం కా దా..గత పదేళ్ల పాలనలో మీరు చేసిన పాపాలు మేం మోయాల్సి వస్తోంది. మిగులు రాష్ట్రాన్ని అ ప్పుల కుప్పగా చేసి మా చేతిలో పెడితే మీరు చేసి న అప్పులకు వడ్డీలు కట్టేందుకు మేం మళ్లీ అప్పు లు చేయాల్సి వస్తోంది. చేసిన అప్పులు తీ ర్చడం వల్లే ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం. అధిక వడ్డీలకు అప్పు లు తెచ్చి పాలన అస్థవ్యస్థం చేసి, వేల కోట్లు బిల్లు లు చెల్లించకుండా
పెండింగ్‌లో పెట్టిన ఆర్థిక భారాన్ని మేము చెల్లించుకుంటున్నాం. రైతు బంధు పేరుతో భూస్వాములు, లే అవుట్లు, నివాసాలు ఉన్న భూములకు మీరు ఇచ్చినట్లు లెక్కా పత్రం లేకుండా రైతు భరోసా ఇవ్వాలా..?, రైతు భరోసాపై మీరేం చెప్పదల్చుకున్నార’ని గత బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో రైతు భరోసా అంశంపై శనివారం జరిగిన లఘు చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు కెటిఆర్ సహా పలు పార్టీల ఎమ్మెల్యేలు లేవెనెత్తిన అంశాలు, అనుమానాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుధీర్ఘ వివరణ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు తమ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుందని తెలిపారు.

రైతు భరోసా అంశంపై నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతు భరోసా, రాష్ట్ర అప్పుల అంశంపై ముందు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రైతు భరోసా, రాష్ట్రంలో అప్పుల అంశంపై సిఎం బిఆర్‌ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావులపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.72,817 కోట్లు రైతు బంధు రూపంలో ఖర్చు చేస్తే దానిలో అనర్హులకు దాదాపు రూ.22వేల కోట్లు ఆయాచిత లబ్ది చేకూర్చారని లెక్కలతో సహా వివరించారు. సాగులో లేని భూములకు, గుట్టలు, లే-అవుట్లకు, జాతీయ రహదారులకు కూడా రైతు బంధు ఇచ్చారని మండిపడ్డారు. గతంలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారికి కూడా రైతు బంధు ఇచ్చారని, ఆమన్ గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లకు, క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా? అని సిఎం సభలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 50 కి.మీ పరిధిలో 70 నుంచి 80 శాతం వ్యవసాయం చేయడం లేదని, అయినప్పటికీ వాళ్ల అనుయాయులు కొందరు నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పొందారని ఆరోపించారు.

గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల 3 కోట్ల ఎకరాలకు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్లి, రైతు బంధు రూపంలో వేలాది కోట్లు కొల్లగొట్టారని బిఆర్‌ఎస్ పాలనపై ధ్వజమెత్తారు. రైతు భరోసాను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తోందని అన్నారు. రైతు భరోసాపై నిర్ణయాల్లో ప్రధాన ప్రతిపక్షం సలహాలు తీసుకుని విధివిధానాలను ముందుకు తీసుకెళ్లాలని తాము భావిస్తున్నామని సిఎం స్పష్టం చేశారు. రైతు భరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని భూమినే నమ్ముకుని, భూమిని అమ్మగా భావించిన రైతులను ఆదుకోవాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని సిఎం వివరించారు. ఉమ్మడి ఏపిలో 16 మది సీఎంలు కలిసి రూ.72 వేల కోట్ల అప్పులు చేసి రూ.72 వేల కోట్ల అప్పుతో అనేక ప్రాజెక్టులు చేపట్టారని సిఎం రేవంత్ గుర్తు చేశారు. అయితే గత పదేళ్లలో సర్కార్ రూ.7.22 లక్షల కోట్లు అప్పు చేసి ‘కూలేశ్వరం’ (కాళేశ్వరం) ప్రాజెక్ట్ కట్టిందని, తీరా చూస్తే కొత్తగా కేవలం 50 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. తండ్రి పేరు చెప్పుకుని తాను ఈ స్థాయికి రాలేదని, ఒక్కొక్కడిని తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చానని రేవంత్‌రెడ్డి పరోక్షంగా కెటిఆర్‌పై ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వం ఇచ్చింది పెట్టుబడి సాయమే
గత బిఆర్‌ఎస్ పాలనలో రైతు బంధు ఉద్దేశం పెట్టుబడి సాయం పథకమని, పెట్టుబడి సాయం నిజమైన రైతులకు అందాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన మేథస్సుతో రైతు భరోసాపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇస్తారని తాము భావించాం, కానీ సభలోకి వస్తే సమాజం ముందు తల దించుకోవాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదేమోనని కెసిఆర్‌పై రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. వాళ్లు రైతు బంధు పేరుతో అనర్హులకు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని అందరికీ ఇవ్వాలంటున్నారు, వాళ్ళను ఆదర్శంగా తీసుకోమంటున్నారని సభలో బిఆర్‌ఎస్ సభ్యులపై సిఎం మాటల దాడి చేశారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటే వాళ్లలాగే మేము కూడా ఇక్కడ ఉండం అని వ్యాఖ్యానించారు.

రైతుల ఆత్మహత్యల్లో ధనిక రాష్ట్రం రెండో స్థానం
రాష్ట్ర విభజన జరిగే సమయానికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆత్మహత్యల విషయంలో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని సిఎం రేవంత్ విమర్శించారు. 2019లో తాను పార్లమెంట్‌లో రైతు ఆత్మహత్యలపై నేను అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2014, 2015, 2016కు సంబంధించి రైతు ఆత్మహత్యలపై సభలో సమాధానం ఇచ్చారని అన్నారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 2014లో 2568, 2015లో 3030, 2016లో 2550 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బిఆర్‌ఎస్ ఏలుబడిలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో 2014లో 898, 2015లో 1358, 2016లో 632 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏపీలో 2014లో 160, 2015లో 516, 2016లో 239 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

అబద్దాల సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాలేదు
రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంటే, తెలంగాణ రెండో స్థానంలో ఉందని సిఎం రేవంత్ చెప్పారు. అయితే భారాస పాలనలో 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించామని బిఆర్‌ఎస్ పాలకులు చెబుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాలేదంటూ కెసిఆర్‌ను పరోక్షంగా దుయ్యబట్టారు. అయితే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడు మాత్రం అసెంబ్లీకి వచ్చారని సీఎం ఎద్దేవా చేశారు.

బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రుణ మాఫీ రూ.27వేల కోట్లు
బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన రుణమాఫీ కేవలం రూ.27 వేల కోట్లు మాత్రమేనని సిఎం రేవంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. మొదటి ఐదేళ్లలో లక్ష రూపాయల రుణమాఫీకి వాళ్లు ఖర్చు చేసింది రూ.16,143 కోటు కాగా అది కేవలం మిత్తికే సరిపోయిందని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వీళ్లు చేసిన రుణమాఫీ రూ.11, 909 కోట్ల 31 లక్షలు మాత్రమేనని తెలిపారు. దీనిలో కూడా రూ.8,515 కోట్లు మిత్తికే సరిపోయిందని, ఇక వారు చేసిన రుణమాఫీ కేవలం రూ.3,384 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో కేవలం 27 రోజుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా 25,35,963 రైతులకు రూ.20,616 కోట్లు రుణ మాఫీ చేసి ప్రభుత్వం రైతుల రుణం తీర్చుకుందని సిఎం ప్రకటించారు. ఇది మా గొప్పతనంగా తాము అనుకోవడంలేదని ఇది మా బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో రైతు రుణమాఫీకి 2018 డిసెంబర్ 11 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్ల మధ్య రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని, ఆ మేరకే జివో విడుదల చేశామని స్పష్టం చేశారు. ఆనాడు రైతులకు ఇవ్వడానికి 8 వేల కోట్లు కూడా లేవని చెప్పి ఇప్పుడు రైతుల కోసమే బతుకుతున్నట్టు బిఆర్‌ఎస్ వారు మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అప్పు రూ.7.22 లక్షల కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో అప్పు రూ.7.22 లక్షల కోట్లు అయితే వాళ్ళు తెచ్చిన అప్పుకు 11.5 వడ్డీ చెల్లిస్తున్నామని సిఎం అన్నారు. ఎవరైనా వడ్డీ ఎక్కువైతే తగ్గించండని అడుగుతాం కానీ 11.50 శాతం పైగానే వడ్డీ చెల్లించేలా అప్పులు చేసిన ఘనత బిఆర్‌ఎస్ పాలకులదేనని ఎద్దేవా చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన చాలా సార్లు ఆర్థికశాఖ న్యాయ నిపుణుల కాళ్ళు పట్టుకుని వడ్డీ తగ్గించే విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశానని, వాళ్ల కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు హాస్టళ్లకు మీరేం చేశారని బీఆర్‌ఎస్‌ను సిఎం ప్రశ్నించారు. హాస్టల్ కట్టలేదు, అమ్మాయిలకు టాయ్‌లెట్లు కట్టలేదన్నారు. బాత్‌రూంకు వెళ్లాలంటే నాలుగు గంటల నుండి క్యూ కట్టాల్సిన పరిస్థితి నాటి బిఆర్‌ఎస్ పాలకులు కల్పించారని ఆరోపించారు. పదేళ్లు బాత్రూం కూడా కట్టనందుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్ పాలకులను డిమాండ్ చేశారు. అందుకే కెసిఆర్ సభకు రావడం లేదు, వస్తే కడిగేద్దామని ఏడాది నుండి చూస్తున్నానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీరెంత.. మీ స్థాయి ఎంత, నా నిబద్ధతను మీరా ప్రశ్నించేదని తీవ్ర స్థాయిలో సీఎం మండిపడ్డారు. పేపర్ దిద్దలేని మీరు, టీఎస్పీఎస్సీ పరీక్ష పెట్టలేని మీరు, నన్నా అడిగేదని బిఆర్‌ఎస్‌పై రెచ్చిపోయారు.

ఆర్థికమంత్రిగా హరీష్‌రావు లెక్కలన్నీ దొంగ లెక్కలే
ఆర్థిక మంత్రిగా పని చేసిన సమయంలో కేసీఆర్ దొంగ లెక్కలు చూపించలేదు, ఈటల కూడా దొంగ లెక్కలు చూపలేదని, కానీ తర్వాత వచ్చిన హరీష్‌రావు దొంగ లెక్కలు రాశాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ పెద్దమనిషి పని ఎట్లా ఉందంటే ప్రశ్నపత్రం నువ్వే రెడీ చేసి, నువ్వే సమాధానం చెప్పి, నువ్వే ఎక్కువ మార్కులు వేసుకుని ఇదే నా ఘనత అంటున్నాడని విమర్శించారు. అప్పులు ఎక్కడ ఉన్నాయో, తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడనివ్వకుండానే తమ చేతులు విరగొట్టాలి అని చూస్తున్నారని బీఆర్‌ఎస్‌పై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రజలు ఇచ్చిన దీవనతో సీఎం అయ్యానని తెలిపారు.

కోట్ల రూపాయలతో లావాదేవీ పెట్టుకుని ఫార్మా పెట్టొచ్చు, ఏమీ లేని తన ప్రాంతానికి మెడికల్ కాలేజీ పెడితే తప్పా అని అన్నారు. కాలేజీలు తీసుకున్నా తప్పే అంటారు, కొడంగల్ 3 లక్షల ఎకరాల్లో 1300 ఎకరాలు తీసుకుని పరిశ్రమలు పెడదామని అనుకున్నానని అన్నారు. కొడంగల్ ప్రజలకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ కోట్లు ఖర్చు చేసి అధికారుల మీద దాడి చేయించారని మండిపడ్డారు. కొడంగల్ లో పరిశ్రమలు పెట్టొద్దా, ఉద్యోగాలు ఇవ్వొద్దా, మా పిల్లలు డాక్టర్లు కావద్దా అని అన్నారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతా అని అందుకే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News