Wednesday, January 22, 2025

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగింది
రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యింది
పదేళ్ల తర్వాత మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరం
కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంది
కెసిఆర్ చేసిన పాపాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నం
కెసిఆర్ మాదిరిగా తాము కమీషన్ల దందా చేయడం లేదు
పెండింగ్ పనుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నాం
తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, బిఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సిఎం రేవంత్‌రెడ్డితో పాటు చేవెళ్ల ఎంపి అభ్యర్థి రంజిత్‌రెడ్డి పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై నిర్వాహకులకు సిఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల తర్వాత అయినా మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరమన్నారు.

బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయినందుకు, కవిత జైలుకు పోయినందుకు కెసిఆర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు. కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ పాపాలతోనే ఈ కరువు పరిస్థితులు వచ్చాయని సిఎం ఎద్దేవా చేశారు. కెసిఆర్ అధికారం కోల్పోయిన బాధలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుందన్నారు. 65 లక్షల రైతుల ఖాతాలో తాము రైతుబంధు వేశామని, మిగిలింది 4 లక్షల రైతులేనని ఎన్నికలు అయిపోగానే వీరికి కూడా రైతుబంధు వేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

రైతులపై కెసిఆర్ కపట ప్రేమ
ఇటీవల సూర్యాపేటలో కెసిఆర్ మాట్లాతుండగా మైక్ కట్ కావడంపై సిఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. సూర్యాపేటలో కెసిఆర్ మీడియాతో మాట్లాడుతుండగా మైక్ ఆగిపోవడానికి కారణం జనరేటరేనని ఆయన చెప్పారు. ఆ రోజు సూర్యాపేట డివిజన్‌లో 30 సెకన్లు కూడా కరెంట్ కట్ కాలేదని, కానీ, కరెంట్ పోయిందని కెసిఆర్ సిగ్గులేకుండా చెప్పారని రేవంత్ ఫైర్ అయ్యారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తాము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే తమను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేశారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కెసిఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. తాము తలుచుకుంటే కెసిఆర్ బయటకు వెళ్లేవారా అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ఖాతాలో రూ. 1,500 కోట్లు ఉన్నాయని, రైతులకు రూ.100 కోట్లు సాయం చేయొచ్చు కదా అని ఆయన చెప్పారు. ఎంపి ఎన్నికల కోసమే కెసిఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని సిఎం రేవంత్ వివరించారు.

ఢిల్లీ అందుకే వెళ్తున్నాం…
కెసిఆర్ మాదిరిగా తాము కమీషన్ల దందా చేయడం లేదని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని సిఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. తాము ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తెలంగాణ హక్కులు సాధిస్తున్నామని, అందుకే అక్కడకు వెళ్తున్నామన్నారు. కెసిఆర్ కుటుంబ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. కెసిఆర్ పాపాల వల్ల బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులు పారిపోతున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. ఆ పార్టీ నేతలను కాపాడుకోవడానికి కెసిఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. బిఆర్‌ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూన్ 9వ తేదీ తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సిఎం రేవంత్ అన్నారు. ఆ రోజే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని కాపాడేందుకు 24 గంటలు కష్టపడుతున్నాం
బిఆర్‌ఎస్ పదేళ్లలో చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు 24 గంటలు కష్టపడుతున్నామని, పేదలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. గతేడాది వానాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గిపోయాయని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో సైతం నీటిమట్టాలు డెడ్ స్టోరేజ్‌కు పడిపోయాయని రేవంత్ తెలిపారు. రైతులకు కొంత నష్టమైనా తాగునిటీకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ట్యాంకర్లతో ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తామన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటే…
ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలను రాష్ట్రంలో అమలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని సమస్యలు ఉన్నాయని, నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమవుతుందని సిఎం రేవంత్ ప్రశ్నించారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనని ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీశాయన్నారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కెసిఆర్‌కు 48 గంటల సమయం ఇస్తున్నానమన్నారు. ఆ లోగా రైతుల వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తానని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

వేల పుస్తకాలు చదవిన కెసిఆర్‌కు కాలం గురించి తెలియదా…
కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందంటున్నారు, చలికాలమైన డిసెంబర్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అలాంటప్పుడు వర్షాలు పడలేదని అనడం విడ్డూరంగా ఉందని సిఎం రేవంత్ అన్నారు. వేల పుస్తకాలు చదవిన కెసిఆర్‌కు వానాకాలం, చలికాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అని ఆయన రేవంత్ ప్రశ్నించారు. గత వర్షకాలంలో కెసిఆర్ ప్రభుత్వమే ఉందని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ వారసత్వంగా కరువు, అప్పులు వచ్చాయని, మీరు చేసిన పాపాలు మాకు అంటగట్టడమేమిటని సిఎం రేవంత్ ప్రశ్నించారు. గతంలో తాము ప్రజల సమస్యలపై పోరాడకుండా కెసిఆర్ నిర్భందం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల గొంతు నొక్కిందని ఆయన స్పష్టం చేశారు.

కోడ్ వల్లే పథకాలకు అంతరాయం
తుక్కుగూడలో ఈనెల 6వ తేదీన ఏఐసిసి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిందని ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కు తెలంగాణ కంచుకోట అని నిరూపిస్తామన్నారు. తుక్కుగూడ సభలో ఏఐసిసి మేనిఫెస్టో విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి జరిగే మేలు జరిగేలా ఈ సభ ద్వారా తెలియజేస్తామన్నారు. అదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అందరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని సిఎం కోరారు.

తెలంగాణ నుంచి నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. ఈ సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తెలంగాణలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ రావడంతో పథకాలకు కొంత అంతరాయం కలిగిందన్నారు. ఎన్నికల తర్వాత మిగతా హామీలను అమలు చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని సిఎం రేవంత్ కొనియాడారు. మహిళా విభాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News