మీ పిల్లలిద్దరినీ మాపైకి ఎందుకు
ఉసిగొల్పారు? ఇకనైనా వారికి
బుద్ధి చెప్పండి అసెంబ్లీలో
ప్రతిపక్షనేత సీటు ఖాళీగా ఉంచడం
భావ్యం కాదు.. అసెంబ్లీకి వచ్చి
మాకు సలహాలు, సూచనలు
ఇవ్వండి అధికార, విపక్షాలను
ఇండియా, పాకిస్థాన్‌లుగా ఎందుకు
మార్చారు? ఏ సూచనా
చేయకుండా ప్రభుత్వాన్ని
అడ్డుకుంటామనడం రాష్ట్రానికి
మంచిదా? అర్హులైన
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఇస్తాం తెలంగాణ తల్లి విగ్రహం
ఆవిష్కరణ కార్యక్రమానికి కెసిఆర్,
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని
ఆహ్వానిస్తాం ఇందిరమ్మ యాప్
ఆవిష్కరణ కార్యక్రమంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని సిఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇం టెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు రేవంత్ రెడ్డి చె ప్పారు. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించి ఇళ్లు కేటాయిస్తామన్నారు. గోండులు, ఆదివాసీలకు కోటాతో సంబంధం లేకుండా ఇళ్లు ఇ స్తామన్నారు.గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృ ష్ణారావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. అసెంబ్లీకి కెసిఆర్ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రంలో అధికార, విపక్షాలు అంటే భారత్- పాకిస్థాన్ తరహాలో పరిస్థితిని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. “ఎవరినో నిం దించుకుంటూ కాలం గడపకుండా సమస్యలను ఒక్కొక్కటిగా
పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం.
దీనికి ప్రతిపక్షాలు కొంత సమయం ఇచ్చి సహకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలపై చర్చించేవారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేసేవారు. లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పేవారు. ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంప్రదాయం ఉండేది. సభలో కొన్ని అంశాలను చర్చించి ఆ తర్వాత ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా అప్పటి మంత్రులను కలిసేవాళ్లం..నిధులు రాబట్టుకునేవాళ్లం. గత పదేళ్లు ఆ అవకాశం కల్పించలేదు. సచివాలయానికే రాలేదు. పదేళ్లు మీరేం చేశారని మేం అడగటం లేదు. ప్రజలు అన్నీ గమనించే బిఆర్‌ఎస్‌ను అధికారానికి దూరం చేశారు. ఇప్పటికైనా మీ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మీ విధానమేంటి? ఆలోచనేంటి? ఈ ప్రభుత్వమే నడవొద్దా?ప్రజలకు సంక్షేమం చేపట్టొద్దా? రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మీరు సభకే రావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకోవాలి? మీ అనుభవం, చతురతను ఉపయోగించి పాలకపక్షానికి సూచనలు చేయండి. ఏ సూచనా చేయకుండా అడ్డుకుంటామనే విధానంలో ఉండటం తెలంగాణకు మంచిదా? మీ పార్టీ నేతలు తెలియక ఏదైనా అన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పాలి కదా! మీ పిల్లలిద్దరినీ మాపైకి ఉసిగొల్పి ఎందుకిలా చేస్తున్నారు? ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు
రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం…ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు…అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారు..దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు. రూ.10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు రూ.5 లక్షలకు చేరుకుందని, ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది మా లక్ష్యం…తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని మండిపడ్డారు. వేలాది ఇళ్లను పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ వదిలేశారని దుయ్యబట్టారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని తాము పూర్తి చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ఇటీవల రూ.195 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కేసీఆర్ తనకు అవసరమైన ప్రగతిభవన్‌ను, వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్త దాన్ని వేగంగా నిర్మించారని విమర్శించారు.
దాంతోపాటు ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను వేగంగా నిర్మించుకున్నారని, కానీ పేదల ఇళ్లు పూర్తి చేయలేకపోయాని విమర్శించారు. గజ్వేల్, జన్వాడ ఫామ్‌హౌజ్‌ల నిర్మాణంపై మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుందని, పేదవారికి అన్యాయం జరుగుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని, అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇళ్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్..ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఉన్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా లబ్దిదారుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తామని, అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్ హౌస్‌ను చూపిస్తామన్నారు.
తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తంగా 4.50 లక్షల ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తాం. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామన్నారు. గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తున్నామని తెలిపారు. పెరిగిన ధరలు, పేదవారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారు ఇళ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని ఈ పథకం తీసుకువచ్చామయని, పెరిగిన ధరలు, పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద వానికి 5 లక్షలు ఇచ్చి ఇళ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ నెల 7, 8, 9 మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ సంబురాల్లో అందరూ పాల్గొని ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ పండుగ అందరి పండుగ..ఈ ప్రజా ప్రభుత్వం అందరిది. ఈ సంక్షేమం అందరిది. రాష్ట్ర అభివృద్ధి అందరిదీ.
ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఆ మూడు రోజుల పాటు సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధపూర్ణిమ ప్రాంతం అంతా తెలంగాణ కార్నివాల్ జరుగుతుంది. తెలంగాణ వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా అందరూ ఆహ్వానితులేనని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి ఒక పండుగ. తెలంగాణ బ్రతుకే ఒక పండుగ. అందరూ భాగస్వాములు కావాలి. ఒక మంచి వాతావరణంలో ఈ పండుగ జరుపుకుందామని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావుతో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఆహ్వానం అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్‌ని కలిసి ప్రత్యేక ఆహ్వాన లేఖలను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ని, ప్రొటోకాల్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కె. కేశవరావు, నరేందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్ మేయర్, డిప్యూటీమేయర్ ప్రజా ప్రతినిధులు, సలహాదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పుట్టాను..ఆత్మగౌరవం తో బతుకుతున్నాం.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకుంటున్నామని ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉన్నారని తెలిపారు. నాడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి భారీ సభలు నిర్వహించారు.. సీఎల్పీ నేతగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాం..ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకడానికి.. ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు కోరారని, నాలుగున్నర లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మిగులు బడ్జెట్ తో టీఆర్‌ఎస్ పాలకులకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే మాకు 7 లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని అప్పగించారని, వారు చేసిన అప్పులకు 64 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని తెలిపారు.
మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుల నమోదు : గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నట్లు గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించామని తెలిపారు. కాస్త ఆర్థిక పరిస్థితి బాగున్న వారు పెద్దగా ఇల్లు నిర్మించుకోవచ్చని తెలిపారు.