హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌కు మెట్రోను పొడిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైలును విస్తరిస్తామని చెప్పారు.
రాజేంద్రనగర్‌లో హైకోర్టు నిర్మించి అక్కడి వరకు మెట్రో నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్ఎండిఎ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్ లో నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మూసీ నదిని రూ.50 వేల కోట్లతో ఆధునీకరిస్తామని తెలిపారు. వైబ్రంట్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని సిఎం రేవంత్ చెప్పారు.
కాగా, ఎస్ఆర్ డిపిలో భాగంగా రూ.148.5 కోట్లతో బైరామల్ గూడ కూడలిలో సెకండ్ లేవల్ వంతెనను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్, సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్టు అండర్ పాస్ నుంచి హయత్ నగర్ వెళ్లే వాహనాలకు ఉపయోగపడుతోంది. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీనగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.