మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు నిర్వహించిన జన జాతర బహిరంగ స భలో ఆయన ప్రధాని మోడీ, బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌పై నిప్పులు చెరి గారు. మహబూబాబాద్ ఎంఎల్‌ఎ డాక్టర్ భూక్య మురళీనాయక్ అధ్యక్షతన జరిగిన భారీ సభను ఉద్దేశిం చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తేజపూరిత ప్రసంగాన్ని చేసి పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… నిండు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోడీ తెలంగాణలో ఓట్లు, సీట్లు అడిగేందుకు మన ముందుకు వచ్చేందుకు ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతో పాటు రాష్ట్ర ప్రజలను అవమానించడంతో పాటు గత పదేళ్లపాటు అన్ని విధాలుగా అన్యాయం చేసిండని మోడీపై విరుచుకుపడ్డారు.
కేంద్రంలో ప్రధానిగా ఢిల్లీలో ఉండే మోడీ, రాష్ట్రంలో పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఫాంహౌస్‌కే పరిమితమైన కెడి (కెసిఆర్‌ను ఉద్దేశించి) ఒక్కటే అని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ మోడీ, కెసిఆర్‌ల విధానాలు ఒక్కటే అని స్పష్టం చేశారు. అనేక నల్లచట్టాల బిల్లలు ఆమోదం కోసం చేతులెత్తిన బిఆర్‌ఎస్ ఎంపిలు ఇప్పుడు ఎన్నికల్లోనూ లోపాయికారీ ఒప్పందాలకు తెరతీశారని ధ్వజమెత్తారు. తన కూతురు బెయిల్ కోసం కెసిఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారని అన్నారు. కొన్ని ఎంపి స్థానాల్లో లోపాయికారీ ఒప్పందంతోనే బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి అభ్యర్థులను ఖరారు చేశారని ఆరోపించారు. మానుకోట కాంగ్రెస్ కంచుకోట అని నిరూపించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం, కోదండరాం తెలంగాణ జనసమితి, ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడగడతామని, అందుకు కొంత అలస్యమైందని అన్నారు. ఇందుకోసం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సర్వంఒడ్డి దేశంలో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దేశ ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయంతీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో గత పదేళ్ల అప్రజాస్వామిక మోడీ పాలనను అంతమెందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. అందుకోసం జరుగుతున్న ఎన్నికలను వేదికగా తీసుకుని మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమికి మద్దతుగా ప్రజలు నిలవడం ఖాయమన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి గెలుపు సాధ్యమన్నారు. జూన్ 9న దేశ ప్రధానిగా రాహూల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమని ్డ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ, తెలంగాణలో సిఎంగా వెలగబెట్టిన కెసిఆర్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ,
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, సీతారామ ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు ఊసే ఏమైందని ఆ పార్టీలను నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పడువు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతులో బొందపెట్టినట్లు ఇప్పుడు మోడీని కూడా పాతిపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. మోడీ, కెడిలు ఒక్కటే అని, ఒకరికొకరు మద్దతుగా నిలిచారన్నారు. కెసిఆర్ ఇచ్చే కమీషన్ల కోసం మోడీ ఆశపడి మద్దతిచ్చారని అన్నారు. మోడీ తీసుకువచ్చిన నల్లచట్టాల బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్‌లో చేతులు ఎత్తినోళ్లలో ఇక్కడి ఎంపి కవిత లేదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని తిరిగి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని నిలదీశారు. మొన్నటి ఎన్నికల్లో తండ్రి రెడ్యాకి బుద్ధ్ది చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అతని బిడ్డ కవితను కూడా అదేరీతిలో ఇంట్లో కూర్చోబెడతారన్న సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. ఓట్లు అడిగే హక్కు బిఆర్‌ఎస్, బిజెపిలకు లేదన్నారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని
లాథూర్‌కు తీసుకుపోయినోళ్లకు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాకుండా గిరిజన బిడ్డల ఉన్నత చదువులకు అడ్డం పడింది మోడీ కాదా అని అన్నారు. ఐటిఆర్‌ఆర్, మూసీ నది, పాలమూరు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మేడారం జాతరకు జాతీయ హోదా ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ఉండి ఏం చేశారని నిలదీశారు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారంటూ నిండు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ తెలంగాణను అవమానించడం ఎలా సమర్ధించుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ‘కుంభమేళా, గంగానది ప్రక్షాళనకు వేలాది కోట్ల నిధులు ఇచ్చిన కేంద్రం మోడారానికి ముష్టి మూడు కోట్లు ఇవ్వడమే కాక జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వడం కుదరదని చెప్తావా.. మీకు ఎంత ధైర్యం..ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు’ అంటూ బిజెపి నాయకుల తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.
ఆలోచన చేసి తీర్పు ఇవ్వండి..
తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి పార్లమెంట్ ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వండని సిఎం పిలుపునిచ్చారు. తెలుగు బిడ్డల్ని కూడా అవమానించారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంసి స్థానాలు ఉంటే ఏకలింగం అయిన కిషన్ రెడ్డి ఒక్కరికే కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. యుపికి 12, గుజరాత్‌కు ఏడు మంత్రి పదవులు ఇవ్వడం అంటే మీ అయ్య జాగీరా అని నిలదీశారు. ఇలా మనల్ని అవమానించిన మోడీకి ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఒక్క ఓటు, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తగిన బుద్ధి చెప్పితీరాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో తల్లుల కడుపుకోతను అర్థం చేసుకున్న తల్లి మనస్సుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ కొడుకును ఇప్పుడు దేశ ప్రధానిగా చేసుకునే అవకాశాన్ని మనం వదులుకోవద్దని కోరారు. జూన్ 9న ఢిల్లీలో జరిగే రాహూల్ గాంధీ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే పండుగకు మన రాష్ట్రం నుంచి 14 మంది గెలిచే కాంగ్రెస్ ఎంపీలతో మనం భాగస్వాములమవుదామని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకోసం పరితపించే త్యాగాల కుటుంబం నుంచి వచ్చి దేశంలో అనేక రాష్ట్రాల్లో పాదయాత్రలు చేపట్టిన రాహూల్‌గాంధీ కంటే మంచి నాయకుడు దొరుకుతాడా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేసి తీరుతాం..
భద్రాచలం రాముల వారి సాక్షిగా తాము ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేసి తీరుతామని సిఎం స్పష్టం చేశారు. హామీలపై అవాకులు పేలుతున్న బిఆర్‌ఎస్, బిజెపి నేతలు తాము పదేళ్లు అధికారంలో ఉన్న రోజుల్లో గాడిదలు కాశారా అని ఎద్దెవా చేశారు. తాము వంద రోజులు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి మా కంటే ప్రజా సంక్షేమం కోరుకునే ఎవరు లేరన్నారు. మోడీ, కెడిలు చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చారా అని నిలదీశారు. వీరిద్దరూ ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చారా, దళితుడిని సిఎంని చేస్తామన్నారు, మూడు ఎకరాలు ఇస్తామన్నారు ఇచ్చారా అని ప్రశ్నించారు. మోడీ నల్లధనం తెప్పించి జన్‌ధన్ ఖాతాల్లో వేస్తామని చెప్పారు.. ఏ ఒక్కరికన్నా ఒక్క రూపాయి అన్నా వేశారా అన్నారు. తాను అయ్యా, అవ్వ పేరు చెప్పుకుని ఎదగలేదని.. మీ లాంటి వాళ్లను తొక్కి పైకివచ్చినవాడినని.. నన్నేం చేయలేరు’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలనే కొనసాగుతుందన్నారు. పద్రాగస్టు లోపే రూ. రెండు లక్షల రుణమాఫీ చేపట్టి తీరుతామన్నారు. వచ్చే సీజన్ పండించి వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తాం, పేదవాడికి ఇళ్లు కట్టించేందుకు కంకణబద్ధ్దులం అవుతామని అన్నారు.
మెజార్టీలో మానుకోట నిలవాలి..
రాష్ట్రంలో మనం గెలుచుకుంటామన్న ఎంపి స్థానాల్లో మహబూబాబాద్, ఖమ్మం అత్యధిక మెజార్టీ సాధిస్తాయని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బలరాం నాయక్‌నే తెలంగాణలో కాంగ్రెస్ ఎంపిల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి మొదటి స్థానంలో నిలిచేందుకు ఖమ్మంతో పోటీ పడతారనే నమ్మకం, విశ్వాసం తనకుందన్నారు. అందుకు సిద్ధమేనా అని పార్టీ శ్రేణులను సిఎం ప్రశ్నించగా కరతాళధ్వనులతో సిద్ధం అంటూ ఉత్సాహంతో చేతులు లేపారు. ఈ సభలో ఎఐసిసి కార్యదర్శి రాకేష్ చౌదరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూర్య, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, యశస్వినీ రెడ్డి, ఎంపి అభ్యర్థి పోరిక బలరాం నాయక్, పలువురు చైర్మన్లు మాలోతు నెహ్రూనాయక్, తేజావత్ బెల్లయ్యనాయక్, డిసిసి అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.