Thursday, January 23, 2025

మా ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మేడ్చల్ : నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో అధికారంలో వచ్చిన మన ప్రభుత్వాన్ని వాడొకడు.. వీడొకడు మోపై మన ప్రభుత్వాన్ని పడగొడుతామని అంటున్నాడని, ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ ప్రజాదీవెన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఒక దళితుడు సిఎల్‌పిగా ఉంటే ఓర్వలేక డజన్ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కుట్రలు పన్నారన్నారు. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా మీ కళ్లు మండుతున్నాయా అని అన్నారు. మీ కడుపు కాలినా మీ కండ్లు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటే మా కార్యకర్తలు మీ కండ్లల్లో కారం కొడుతారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతీ సమస్యను పరిష్కరిస్తూ నేటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. ఎంతో మంది యువకులు ఉద్యోగాలు లేక కోచింగ్ సెంటర్‌ల చుట్టూ తిరుగుతూ ఉంటే నాడు మాజీ సిఎం కెసిఆర్ ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చాడా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు.

కెసిఆర్ బిడ్డ అంటున్నది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదని అంటుంది చేతనైతే మీ అయ్యను అసెంబ్ల్లీకి రమ్మను ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చామో లెక్కతో చూపిస్తామని అన్నారు. సభలోకి రారు, సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారని విమర్శించారు. కండ్లల్లో చూడాలంటే భయం ఫాంహౌస్‌లో పంటడు, నల్లగొండ సభకు పోయి మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు డిపాజిట్లు వస్తయో చూసుకోవాలని హితవు పలికారు. మీ బిఆర్‌ఎస్ అధికారం ఉన్న సమయంలో ధర్నాచౌక్‌లు వద్దు అని ఎత్తేశారని, మేం అధికారంలో వచ్చాక ధర్నా చౌక్‌కు అనుమతిస్తే నువ్వెల్లి ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నావని ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో మూడు పిల్లర్లు పోయినయి వాటిని మరమ్మతులు చేయి అంటున్నావు మా చేతుల ఏమిలేదని చేతులు దులుపుకుందామని చూస్తున్నావా అని ఎద్దేవా చేశారు. అది రిపేర్ చేస్తే ఉంటదా ఉండదా కుంగిపోతదా అని చూడొద్ద్దా అని అన్నారు. ఢిల్ల్లీ నుంచి అధికారులు వచ్చారు వాటిని పరిశీలించారని అన్నారు. పనిమంతుడు పందిరేస్తే కుక్క తొక తగిలి కూలిపోయింది అన్న చందంగా ఆయన పని ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాడు కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్,

ఎస్సారెస్పీ కట్టినం 50 యేండ్లైనా అవి ఏమైనా అయినా అన్నారు. ఇక్కడ ప్రజలు కేడీని ఇంటికి పంపారని రానున్న ఎన్నికల్లో మోడీని కూడా ఇంటికి పంపిస్తారని అన్నా రు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల్లో మీ అందరు నా కు అండగా ఉండి గెలిపించి పార్లమెంట్‌కు పంపారు మీ అందరు ఆశీస్సులతో మీ బిడ్డగా సిఎంగా ఇక్కడికి వచ్చానని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నా రు. తెలంగాణను ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, ప్లానింగ్ కమీషన్ వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, సలహదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంత్‌రావు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News