బిసి డిమాండ్లను అంగీకరించాల్సిందే 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి లేదంటే మీరు
ఎలా అధికారంలో కొనసాగుతారో చూస్తాం ఈ ఉద్యమం నిప్పురవ్వలా ఎగిసి
దేశమంతా వ్యాపిస్తుంది తెలంగాణ నుంచి బిసి గర్జన మొదలైంది ఇది బలహీనవర్గాలు
చేస్తున్న ధర్మయుద్ధం మేం ఢిల్లీలో మీ కుర్చీని అడగడం లేదు ఎర్రకోటపై జెండా
ఎగురవేస్తామనడం లేదు మా రాష్ట్రంలో అమలు చేసుకుంటాం..అనుమతి ఇవ్వండని
డిమాండ్ చేస్తున్నాం ఇక నుంచి మేము ఢిల్లీకి వచ్చేది లేదు మోడీనే తెలంగాణలోని
గల్లీగల్లీకి రప్పిస్తాం ఢిల్లీ బిసి పోరు గర్జనలో ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరిక
బిసి రిజర్వేషన్లకు డిఎంకె సంపూర్ణ మద్దతు : ఎంపి కనిమొళి కులగణన చేయకుండా
కేంద్రం బిసిలకు అన్యాయం చేస్తోంది : ఎన్సీపి ఎంపి సుప్రియా సూలే
మన తెలంగాణ/హైదరాబాద్: బిసిల డిమాండ్లకు మీరై నా దిగి రావాలి లేదా ఢిల్లీ గద్దె అయినా దిగిపోవాలని సి ఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిసి గర్జన నిప్పు రవ్వలా ర గిలి దేశం మొత్తం వ్యాపిస్తుందని ఆయన వ్యాఖ్యానించా రు. మీరు ఢిల్లీ గద్దెమీద ఎలా ఉంటారో తాము చూస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ నుంచి బిసి గర్జ న మొదలైందని ఇది ధర్మ యుద్ధం అని, ఇక నుంచి మేం ఢిల్లీకి వచ్చేది లేదని మోడీనే తెలంగాణలోని గల్లీ గల్లీకి రప్పిస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్ బిల్లుకు మోడీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇది దేశ వ్యాప్తంగా ఉద్యమంగా రాజుకుంటుందని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బిసిల కు న్యాయం చేస్తే ప్రధాని నరేంద్ర మోడీని సన్మానిస్తామ ని ఆయన తెలిపారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతిస్తే పది లక్షల మందితో సభ పెట్టి ప్రధాని నరేంద్ర మోడీని సన్మానిస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన బిసి పోరు గర్జన సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఎందుకు ఆమోదించడం లేదని, ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని సిఎం ప్రశ్నించారు. బిసి ప్రధానిగా చెప్పుకునే మోడీకి బిసిల ఆత్మ గౌరవం కనిపించటం లేదా అని ఆయన అన్నారు. రిజర్వేషన్లు గుజరాత్‌లో అడగడం లేదని, ఢిల్లీలో కుర్చీ అడగడం లేదని బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రధాని మోడీ ఎందుకు మద్ధతు ఇవ్వడం లేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందనే ప్రధాని మోడీ జనగణన చేయటం లేదని సిఎం రేవంత్ ఆరోపించారు.
బిసి రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు మౌనం?
ఎన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా ఎన్నో చట్టాలను ప్రధాని మోడీ ప్రజల మీద రుద్దారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు బిసి రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతు తెలుపుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని సిఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. బిసి పోరు గర్జనకు దేశంలోని 16 పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని కాంగ్రెస్‌కు చెందిన వంద మందికి పైగా ఎంపిల మద్దతు ఇస్తున్నా పార్లమెంట్ లో దానిని ఎందుకు ఆమోదించటం లేదని సిఎం రేవంత్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో బలం లేకపోయినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ తీసుకొచ్చారని, ఆర్టికల్ 370 బిల్లు తీసుకొచ్చారని, ఇప్పుడు వక్ఫ్ బిల్లు తీసుకొస్తున్నారని, ఈ బిల్లులకు బిజెపికి బలం లేకపోయినా తీసుకొచ్చారని అలాంటిది తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నిం చారు. బలహీనవర్గాల రిజర్వేషన్లు పెంచితే మోడీకి వచ్చిన బాధ ఏమిటని సిఎం రేవంత్ ప్రశ్నించారు. బండి సంజయ్ బిసిల కోసం ప్రాణాలు ఇస్తానంటున్నారని, కానీ, తమకు ఆయన ప్రాణాలు వద్దని రిజర్వేషన్లు పెంచితే చాలని సిఎం రేవంత్ అన్నారు.
తండ్రీ, కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని తండ్రీ, కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా తెలంగాణ సమాజం నుంచి బడుగు, బలహీన వర్గాల నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నానని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన బిల్లుకు అనుమతి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో బిజెపికి గడ్డుకాలమేనని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలి
బిసిల గొంతుక వినిపించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని సిఎం రేవంత్ తెలిపారు. జనాభా తెలియకుంటే రిజర్వే షన్లు ఇవ్వొద్దని కోర్టులు చెప్పాయని, స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకువచ్చామని, రిజర్వేషన్ల అంశానికి శాశ్వత పరిష్కారం లభించాలని రాహుల్‌గాంధీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని, ధామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని ఆయన అన్నారు. బలహీనవర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశాయ్ మండలి కమిషన్ ఏర్పాటు చేసిందని, 52 శాతం బలహీనవర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మండలి కమిషన్ సూచించిందని సిఎం రేవంత్ తెలిపారు.
2021 జనాభా లెక్కల వాయిదా
బిజెపి కుట్ర చేసి మండలి కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేపట్టిందని, అసైన్డ్ చట్టం ద్వారా భూస్వాముల స్థలాలను ఎస్సీ, ఎస్టీ, బిసిలకు కాంగ్రెస్ ఇచ్చిందని, బిసిలను బలపర్చాలన్న ఆలోచనకు బిజెపి వ్యతిరేకమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. బిసిల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కలను వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. జనగణనతో పాటు కులగణన చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారని, జనగణన, కులగణన నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలన్నది కాంగ్రెస్ డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో తొలిసారి తెలంగాణలో బలహీనవర్గాల లెక్క 56.36 శాతంగా తేల్చామని సిఎం రేవంత్ వివరించారు.
బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ
బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదని, దేశ రాజకీయాలకు దిక్సూచిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని సిఎం రేవంత్ తెలిపారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ పాలన, రాష్ట్ర అభివృద్ధిలో బలహీనవర్గాలు భాగస్వాములు కావాలని సిఎం రేవంత్ సూచించారు. రిజర్వేషన్లు పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. రిజర్వేషన్‌లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని సిఎం రేవంత్ గుర్తు చేశారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదని, తెలంగాణలో బలహీవర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే మోడీకి కష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకుంటామని తీర్మానం పంపితే స్పందించలేదని, ప్రధాని తమ ఆలోచనలు పంచుకుంటే గౌరవం ఉంటుందని సిఎం రేవంత్ అన్నారు.