సైనిక్ స్కూల్స్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నేడు ఉదయం 9:45 గంటలకు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు.
పోలీస్ లైఫ్ అనేది చాలా కష్టంతో కూడుకుందని, వారి డ్యూటీల కారణంగా కుటుంబంతో తక్కువ సమయం గడపాల్సి వస్తుందన్నారు. ఇక, ఈ స్కూళ్లలో 50 శాతం అడ్మిషన్స్ అమరుల పిల్లలు, హోంగార్డ్, కానిస్టేబుల్స్ నుంచి ఐపిఎస్ పిల్లల వరకు రిజర్వేషన్ ఉంటుందని ఆయన తెలిపారు. మరో 50 శాతం అడ్మిషన్స్ నాన్ పోలీస్ పిల్లలకు (సివిలియన్) ఉంటాయని ఆయన తెలిపారు. ఈ స్కూల్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ఇంటర్నేషనల్ లెవల్ ఎడ్యుకేషన్, సిబిఎస్సీ సిలబస్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.