పైలట్ ప్రాజెక్టుగా రేపు ప్రారంభం
సంబంధిత జిల్లా కలెక్టర్ల
ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు
ప్రజల సందేహాలు నివృత్తి చేయాలి
వారి సూచనల మేరకు భూభారతి
పోర్టల్‌ను బలోపేతం చేయాలి
రైతులకు, ప్రజలకు సులభంగా
అర్థమయ్యేలా పోర్టల్ ఉండాలి
వేగంగా అది అందుబాటులోకి
రావాలి భూభారతి సమీక్షా
సమావేశంలో అధికారులకు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగం గా అందుబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో సిఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా పలు అంశాలను అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలె ట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజల కు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని సిఎం సూచించా రు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యం లో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని స్పష్టం చేశారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులకు సూచించారు. వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని సిఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి పొంగులేటితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.