Wednesday, November 6, 2024

చైనాతోనేసై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే మా సంకల్పం, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామా కాబోతుం ది. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానం అంటూ ఆయా కంపెనీల ప్రతినిధులకు సులభంగా కొత్త పారిశ్రామిక విధానం అర్థమయ్యేలా సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రముఖ కంపెనీల సిఈఓలు, ప్రతినిధులతో సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులు వరుసగా సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పాటు పలు విషయాలను ఆయా కంపెనీలకు తెలియచేశారు. ఇలా మంగళవారం ట్రైజిన్ టెక్నాలజీస్, ఆర్సీసిఎం కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికాలోని రౌండ్ టేండ్ సమావేశంలో పారిశ్రామికవేత్తలతో కలిసి సిఎం పాల్గొన్నారు. ఇలా ఆయా కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒ ప్పించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించా రు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని ఆయన ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నది తమ సంకల్పమని ఆయన అన్నారు.

దేశంలోనే జీరో కార్భన్ సిటీ
తెలంగాణ అంటేనే వ్యాపారం, తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఈ సందర్భంగా సిఎం వివరించారు. త్వరలోనే హైదరాబాద్‌ను నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది భారత దేశపు భవిష్యత్‌కు చిరునామాగా నిలుస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడతుందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌తో పాటు, మెడికల్, టూరిజం, స్పోర్ట్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్దితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేస్తామని సిఎం ప్రకటించారు. అటువంటి సరికొత్త ఆలోచనలతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్కింగ్ లంచ్ అనంతరం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేండ్ సమావేశమయ్యారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న చైర్‌పర్సన్లు, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజేంటేషన్
ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజేంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మనసులోని మాటలతో పాటు తమ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలేమిటో వెల్లడిస్తానంటూ అందరినీ ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఇది తన మొదటి అమెరికా పర్యటన అని ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా దేశంలోనే అందరినీ ఆకర్షిస్తున్న తెలంగాణకు ఉన్న అనుకూలతలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్, లైఫ్-సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో బలమైన పునాదులు వేసుకుందని ఆయన చెప్పారు. కోవిడ్‌ను అధిగమించేందుకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచానికి సాయం చేసిందన్నారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ సంపద సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణ రావాలి
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమమైన మద్ధతును అందిస్తుందని ఆయన ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతనమైన హైదరాబాద్, ఇంచుమించుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తి రేపుతోందని సిఎం రేవంత్ అన్నారు. అభిరుచితో పాటు అద్భుతమైన దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు రావాలని, హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలతో పాటు అక్కడున్న అవకాశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కలిసికట్టుగా గొప్ప భవిష్యత్‌ను నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి దార్శనికతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు.

ప్రపంచంలోనే టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలను ఆయన విశ్లేషించారు. ఈ సమావేశం తెలంగాణలో కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుందనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. కార్నింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్ వెర్క్లీరెన్, కెకెఆర్ పార్టనర్ దినేష్ పలివాల్, సిగ్నా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ హెడ్ ఎక్రమ్ సర్పర్, న్యూజెర్సీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బిల్ నూనన్, సేఫ్సీ గ్రూప్ చైర్మన్ ఎస్వీ అంచన్, టిల్మాన్ హోల్డింగ్స్ చైర్మన్ సంజీవ్ అహుజా, అమ్నీల్ ఫార్మా కో సీఈఓ చింటూ పటేల్, జేపీ మోర్గాన్ చేజ్ ఈడీ రవి లోచన్ పోలా, ఆక్వాటెక్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సుబ్బారావు, యాక్సెంచర్ ఎండీ అమిత్‌కుమార్, డెలాయిట్ ఎండీ పునిత్ లోచన్, హాబిట్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వీర బుద్ధి, బీఎన్వై మెల్లన్ ఎండి అట్లూరి, పేస్ యూనివర్సిటీ డీన్ డా. జోనాథన్ హిల్, అకుజెన్ చీఫ్ సైంటిఫిక్ హెడ్ అరుణ్ ఉపాధ్యాయ, ఎస్ అండ్ పీ గ్లోబల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్వామి కొచ్చెర్లకోట, ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ ఎండీ అశ్విని పన్సే ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ఆదాయం 160 మిలియన్ డాలర్లు
ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభించడంతో పాటు వెయ్యిమందికిపైగా ఉద్యోగాలు ఇచ్చేలా ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్‌పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది.

మరో ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం
హైదరాబాద్ లో ట్రైజిన్ కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందించనున్నట్టు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోనే దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహారిస్తోంది. గతేడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.

తెలంగాణలో కార్యకలాపాలు విస్తరించడానికి ఆర్సీసిఎం సిద్ధం
ఆర్సీసిఎం విస్తరణతో హైదరాబాద్‌లో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్‌లో పేరొందిన ఆర్సీసిఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికాలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బృందంతో, ఆర్సీసిఎం సీఈఓ గౌరవ్ సూరి నేతృత్వంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుందన్నారు. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్సీసిఎం కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ఆయన ప్రకటించారు. ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగంలో హైదరాబాద్ పే కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందన్నారు. సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసిఎం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందన్నారు.

మొదటిసారిగా హైదరాబాద్‌లో ఆఫీసు ప్రారంభం
ఆర్సీసిఎం మొదటిసారిగా హైదరాబాద్‌లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి అని కంపెనీ సీఈఓ గౌరవ్ సూరీ తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సీసిఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్‌మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News