Monday, December 23, 2024

మూసీపునరుజ్జీవానికి సిఎం పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :మూసీ పునరుజ్జీవాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా మూసీ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన పాదయాత్ర చేయనున్నారు. వలిగొండ- టు బీబీనగర్ మధ్య ఆరు కిలోమీటర్ల మేర మూసీ వెంట నడవడంతో పాటు అక్కడి కాలుష్యం గురించి ప్రజలకు సిఎం రేవంత్ వివరించనున్నారు. తొలి దఫాలో 21 కిలోమీటర్ల మేర మూసీనదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీనది హైదరాబాద్‌లోని మురికి నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలను కలుపుకొని అధ్వాన స్థితిలో ఉమ్మడి
నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

కాలుష్యంతో కూడిన ఆ నీటి కారణంగా పరీవాహక ప్రాంతంలో పంటలు కూడా పండని దుస్థితి ఏర్పడిందని సిఎం అక్కడి ప్రజలకు వివరించనున్నారు. దీనిపై బిఆర్‌ఎస్, బిజెపి చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవ పరిస్థితిని, ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విడమర్చి చెప్పేందుకు సిఎం సిద్ధమయ్యారు. మూసీ పునరుద్ధరణ తర్వాత మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకొచ్చి నింపి స్వచ్ఛమైన నీటిని నదిలో పారించాలన్న తలంపుతో సిఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటీవలే మంత్రులు పొంగులేటి, పొన్నం, భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నగర్ మేయర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కూడిన బృందాన్ని సియోల్ పంపారు. అక్కడ సిటీ మధ్యలో ప్రవహించే నదిని ఎలా పునరుద్ధరించారో చూసి అధ్యయనం చేసి వచ్చింది.

బర్త్ డే రోజు సిఎం పాదయాత్ర
ఈ నెల 8వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. అదే రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాదయాత్ర చేయనున్నారు. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని సిఎం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడ వైటిడిఏ, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులపై సిఎం చర్చిస్తారు. హెలికాప్టర్‌లో సిఎం యాదగిరి గుట్టకు చేరుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. స్వామివారిని దర్శనం చేసుకున్న ‘

అనంతరం రోడ్డు మార్గం మీదుగా వలిగొండ మండలం సంగెం గ్రామానికి సిఎం రేవంత్‌రెడ్డి చేరుకొని పాదయాత్ర ప్రారంభిస్తారు. వలిగొండ- టు బీబీనగర్‌ల మధ్య దాదాపు ఆరు కిలోమీటర్ల మేర సిఎం పాదయాత్ర సాగనుంది. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్రలో సిఎం పాల్గొంటారు. ఆ తరువాత మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లా కు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను సిఎం ప్రారంభిస్తారు. అనంతరం పైప్లైన్ పనులకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News