Sunday, November 24, 2024

రేపు ఢిల్లీకి సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. గతంలో సీఎం ఢిల్లీకి చాలాసార్లు వెళ్లినప్పటికీ, ఈ సారి పర్యటనకు ప్రాధాన్యత ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురిని ఒకేసారి రేవంత్‌రెడ్డి కలువబోతున్నారని ఈ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తునా విజయోత్సవాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వచ్చేనెల డిసెంబర్ 7కు ఏడాది అవుతుండటంతో ఆ రోజు హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. అలాగే విజయోత్సవాల సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి కూడా పార్టీ అగ్రనేతలలో ఒక్కరిని రప్పించాలని సీఎం భావిస్తున్నారు. వీరిని కలిసే సందర్భంగా ఈ కార్యక్రమానికి కూడా సీఎం ఆహ్వానించనున్నట్టు తెలిసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు అధికారంలో ఉండి కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. వారు చేయని పనిని తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉండటంతో ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతల ఒక్కరని కచ్చితంగా రప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా డిసెంబర్ 7న విజయోత్సవ సభ, డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలను వేర్వేరుగా నిర్వహించనుండటంతో ఈ రెండు కార్యక్రమాలకు పార్టీ పెద్దలను రప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

ఈ సారి మంత్రివర్గ విస్తరణ పక్కా
ఏడాది కాలంగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు ఈ సారి కచ్చితంగా ఉండబోతుందని, ఈ మేరకు ఇప్పటికే అధిష్ఠాన పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి ఇంకా అవకాశం ఉండటంతో వీటిలో ఎన్నింటిని భర్తీ చేయాలి, ఎవరెవవరికి ఇవ్వాలి, మంత్రివర్గంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలు, గతంలో మంత్రి పదవికి హామీ ఇచ్చిన అంశాలపై పార్టీ పెద్దలతో సీఎం చర్చించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. అలాగే కొన్ని కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా సీఎం చర్చించనున్నారని తెలిసింది.

మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని ఆశావాహులకు కీలక నామినేటెడ్ పోస్టులు ఇచ్చే ప్రతిపాదనపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్‌రెడ్డి చర్చించనున్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి విస్తరణ పక్కా అని తేలడంతో ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. ‘నా వంతుగా ప్రయత్నం చేస్తా, మీ వంతు కూడా ప్రయత్నం చేయండి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అశావాహులలో కొందరికి హింట్ ఇవ్వడంతో వారు ఇప్పటికే
ఢిల్లీకి చేరుకొని లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News