రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా సిఎం రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జపాన్ టూర్ షెడ్యూల్ దాదాపు ఖరాయ్యింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి సిఎం రేవంత్‌రెడ్డి జపాన్‌లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ‘ఒకాసా ఎక్స్‌ఫో2025’కు సిఎం రేవంత్ హాజరుకానున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఇతర అధికారులు ఈ పర్యటనకు వెళుతున్నారు. సిఎం బృందం ఏయే కంపెనీల ప్రతినిధులతో భేటీ కావాలన్న దానిపై అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. దీంతోపాటు జపాన్‌లో జరిగే పలు ఒప్పందాలపై చర్చించడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
దాదాపు ఎనిమిది రోజుల పాటు
దాదాపు ఎనిమిది రోజుల పాటు సిఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో పాల్గొననున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితో పాటు పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులో సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు దాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని కోరే అవకాశం ఉందని అధికారికవర్గాలు తెలిపాయి. మరోవైపు ఒసాకాలో జరిగే ‘ఇండస్ట్రీయల్ ఎక్స్ పో-2025’లో సిఎం రేవంత్ టీమ్ పాల్గొంటుంది. ఈసారి జపాన్ టూర్ వల్ల రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది దావోస్ పర్యటనలో పలు కంపెనీలను పెట్టుబడుల నిమిత్తం తెలంగాణకు ముఖ్యమంత్రి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
జూన్ లేదా జూలైలో అమెరికాకు సిఎం రేవంత్
జపాన్ పర్యటన తర్వాత జూన్ లేదా జూలైలో సిఎం రేవంత్‌రెడ్డి అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.