శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి :బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో మాట్లాడారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సినీ పరిశ్రమపై పగబట్టినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
పక్కా ప్రణాళికతో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు చిత్రపరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తోందని విమర్శించారు. ‘తొక్కిసలాట ఘటనలో సమస్య ముగిసిన తర్వాత నిన్న ఎంఐఎం సభ్యుడితో అసెంబ్లీలో ప్రశ్న అడిగించుకున్నారని, ఆ ప్రశ్నకు సమాధానమిస్తున్నట్టుగా ఓ సినిమా స్థాయిలో కథ అల్లి మరీ మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గుచేటని అన్నారు. ఎంఐఎం ఒక ఐరన్ లెగ్ పార్టీ అని, గతంలో ఆ పార్టీ బీఆర్‌ఎస్‌తో అంటకాగి, ఆ పార్టీని నిండా ముంచిందని విమర్శించారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పట్టడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
శ్రీతేజ్‌కు పరామర్శ
తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న బండి సంజయ్, శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యాఖ్యలు కాదు: ఎంపి లక్ష్మణ్
తెలుగు సినీ పరిశ్రమపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ధోరణి, వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగినవి కాదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్ మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమపై ముఖ్యమంత్రి కక్ష గట్టరాని, అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసుకొని కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందించారు.