నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే నాకు స్ఫూర్తి
వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు
తీసుకువెళ్లే బాధ్యతను తెలంగాణ అప్పగించింది
రాష్ట్రాన్ని అవనిపై అగ్రభాగాన నిలిపేలా కృషి చేస్తా
ట్వీట్ చేసిన సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ఫ: పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలను కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023వ తేదీన తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని సిఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు. వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను రాష్ట్రం అప్పగించిందని ఆయన తెలిపారు. నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే నాకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు.
ఆ క్షణం నుంచి జన సేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో, సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా, సహచరుల సహకారంతో, జనహితుల ప్రోత్సాహంతో, విమర్శలను సహిస్తూ, విద్వేషాలను ఎదిరిస్తూ స్వేచ్ఛకు రెక్కలు తొడిగి ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి, అవనిపై అగ్రభాగాన తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ 4 కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్పూర్తిగా, విరామం ఎరగక విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతుంది. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి. సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అని రేవంత్ ట్వీట్ చేశారు.