Wednesday, January 15, 2025

అవినీతి నుంచి అభివృద్ధి వైపు..

- Advertisement -
- Advertisement -

సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడుస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ప్రజల ఆకాంక్షలకు
అనుగుణంగానే నిర్ణయం పదేళ్లుగా తెలంగాణ గీతం, విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించలేదు ఒక కుటుంబం కోసమో,
రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ సాధించుకోలేదు : సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్
పదేళ్ళ అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాకుండా అవమానించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని, ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీని సన్మానించుకోవడం తనకు జీవితకాలం గుర్తుండే సందర్భమన్నారు. ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణా తల్లికి వివిధ రూపాలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదని, అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపం గా అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండవచ్చని, వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చని, కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో మనం తెలంగాణ సాధించుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నామని, తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఉద్యమంలో వివిధ పార్టీలు వారికి అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నారని,

కానీ తెలంగాణలోని మన తల్లుల మాదిరిగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరించుకున్నామని తెలిపారు. ఉద్యమం రోజుల్లో ఎక్కడ విన్నా జయ జయహే తెలంగాణ వినిపించేదన్న ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయ జయహే తెలంగాణ పాటకు గౌరవం దక్కలేదని, అందుకే వారు జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించారని పేర్కొన్నారు. పదేళ్లపాటు తెలంగాణ తల్లి వివక్షకు గురైందని అన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్నారు. ఎందరో కవులు, కళాకారులు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని, తమ పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని, వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

డిసెంబర్ 9కి ఎంతో ప్రత్యేకత : భట్టి
డిసెంబర్ 9వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం నుంచి తొలి ప్రకటన డిసెంబర్ 9నే వచ్చిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, కానీ, ఆ ఆకాంక్షలు మాత్రం గత పదేళ్లు నెరవేరలేదని చెప్పారు. ప్రజలు తొమ్మిదిన్నరేళ్లు నిర్బంధాల మధ్య గడిపారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టి అతలాకుతలం చేశారు. భారీ అప్పుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. మహిళలకు ఉచిత ఆర్టీస ప్రయాణం కల్పించాం. రైతు రుణమాఫీ కింద రూ.21వేల కోట్లు ఇచ్చాం.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాన్ని ఇచ్చారు. భారీ అప్పుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. పదేళ్లపాటు విద్యార్థుల డైట్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలను ఒకేసారి 40శాతం పెంచాం. గురుకులాలకు కూడా గత ప్రభుత్వం సరైన భవనాలు నిర్మించలేదని భట్టి అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్దారులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, రాష్ట్రంలో పారిశ్రామిక విధానం పెంపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్‌కు వెళ్లి 36 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు.

జనసంద్రంగా ట్యాంక్ బండ్ పరిసరాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యా రు. దీంతో సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసరా లు జనసంద్రంగా మారాయి. విగ్రహ ఆవిష్కరణ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని దూరం నుంచే ప్రజలు తమ ఫోన్లల్లో ఫోటోలు తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లోనిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు సోమవారంతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News