నేడు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం
వరంగల్ కార్పొరేషన్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ
పనులకు నేడు శంకుస్థాపన చేయనున్న సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: నేడు వరంగల్ జిల్లాలో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. అందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు ఇందిరా మహిళాశక్తి సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే కాళోజీ కళాక్షేత్రాన్ని సిఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. హన్మకొండ బస్టాంప్ సమీపంలోని కుడా మైదానంలో 4.25 ఎకరాల్లో ఈ కళాక్షేత్రం నిర్మాణం జరిగింది. ఈ భవనాన్ని 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. రూ.95 కోట్ల వ్యయంతో రెండు అంతస్థుల్లో దీనిని నిర్మించారు.
గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి రూ.4,170 కోట్ల మంజూరు
గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.4,170 కోట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన నిధులను పరిపాలన అనుమతుల కింద మంజూరు చేస్తున్నట్టు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జిఓ జారీ చేశారు. వరంగల్ కార్పొరేషన్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నేడు సిఎం రేవంత్ ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మాస్టర్‌ప్లాన్ ద్వారా మూడు దశల్లో ఈ పనులు జరుగుతాయి.
మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు
మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా భూసేకరణకు రూ.205 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతోపాటు కుడా మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి రూ.32.50 లక్షల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. ఇన్నర్‌రింగ్ రోడ్డు పొడిగింపుతో పాటు 8.30 కి.మీల ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి రూ.80 కోట్ల నిధులను కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.