Monday, December 23, 2024

రేవంత్‌రెడ్డి పర్యటనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే డుమ్మా

- Advertisement -
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తీరు హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు అంతా హాజరై సీఎంను కలిశారు. అయితే ఏఐసీసీ మెంబర్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేవంత్ ఓరుగల్లు పర్యటనకు దూరంగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్, సీఎం స్వయంగా జిల్లా పర్యటనకు వచ్చినప్పటికీ సొంత పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి మాత్రం వెళ్లి రేవంత్ రెడ్డిని కలవలేదు. వరంగల్ డెవలప్‌మెంట్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా మాధవరెడ్డి డుమ్మా కొట్టారు. రేవంత్ రెడ్డి పర్యటనకు సొంత పార్టీ ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. మాధవ రెడ్డి ఏదైనా అసంతృప్తితో సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారా..? లేక బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారా అన్నది హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీపీసీసీ చీఫ్, సీఎం జిల్లా పర్యటనకు వస్తే సాధారణంగా ఎమ్మెల్యేలు కచ్చితంగా హాజరు అవుతారని, అసంతృప్తితోనే దొంతి రేవంత్ రెడ్డి సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే పార్టీ కార్యక్రమాలకు మాధవ రెడ్డి దూరంగా ఉంటున్నారని, ఈ నేపథ్యంలోనే రేవంత్ పర్యటనకు కూడా ఆయన హాజరు కాలేదని అధికార పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా సీఎం పర్యటనకు సొంత పార్టీ ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని మెగా టెక్స్ టైల్ పార్కును సందర్శించారు. వనమహోత్సవంలో భాగంగా టెక్స్ టైల్ పార్క్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఓరుగల్లులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించడంతో పాటు మహిళ శక్తి క్యాంటీన్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో భేటీ అయిన సీఎం వరంగల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News