Wednesday, November 20, 2024

చంద్ర మండలం లో దాక్కున్నా వదిలిపెట్టా: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహానికి బిఆర్‌ఎస్ అగ్ర నేత కెటిఆర్ ఊచలు లెక్కపెట్టడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ గుడిచెరువులో బుధవారం ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్‌ఎ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్, కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో సిఎం విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కెసిఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కెటిఆర్ చంద్రమండలంలో దాక్కున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పదేండ్ల పాలనలో కెసిఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని.. అవి పూర్తి చేసేది కూడా తమ పార్టీయేనని పేర్కొన్నారు. గతంలో పిసిసి చీఫ్‌గా పాదయాత్ర సమయంలో వేములవాడకు వచ్చాననని, ఆనాడు ఇచ్చినమాట ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు ముంపు గ్రామాల బాధితుల సమస్యలు పరిష్కారం, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి ప్రాంతాల అభివృద్ధ్ది కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధ్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, సిరిసిల్ల ప్యాకేజి 9 పనులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. నవంబర్ 30లోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుండి ఢిల్ల్లీకి నాయకత్వం అందించింది కరీంనగర్ జిల్లా అని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన పివి నరసింహారావును అందించిన జిల్లా కరీంనగర్ అని పునరుద్ఘాటించారు. రైతులకు, యువకుల బాధ కలిగితే కరీంనగర్ నుండే ఉద్యమాలు మొదలయ్యాయని, సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు ఎవరూ మరువలేదన్నారు. 2004లో సోనియా గాంధీ కరీంనగర్ నుండే హామీ ఇచ్చారన్నారు. పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి వంటి ఎంపిలు వీరోచితంగా పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. కరీంనగర్ జిల్లాకు ఎంపి బండి సంజయ్ ఏంచేశారో ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్ల కాలంలో గత ముఖ్యమంత్రి రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసినా రాజన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధ్ది చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్యాకేజి 9 పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో ఆలోచన చేయాలన్నారు.

రూ.11వేల కోట్ల రుణమాఫీ 5 సంవత్సరాల్లో చేస్తే, తమ ప్రభుత్వం కేవలం 25 రోజుల్లో రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రుణమాఫీ, నేడు జరుగుతున్న రుణమాఫీపై చర్చ పెడతాం, ధైర్యం ఉంటే కెసిఆర్ రావాలని సవాల్ విసిరారు. వందలాది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్న తరువాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కోటి 10 లక్షల మంది ఆడబిడ్డలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారని, అందుకు రూ.3700 కోట్ల ఖర్చు పెట్టామన్నారు. రూ . 500గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామన్నారు. సన్న వడ్ల ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించడంతో రాష్ట్రంలోని రైతులందరూ 66 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారన్నారు. రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు తెలిపారు. సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్షం చేయకుండా నూలు డిపో, వైద్య కళాశాల ఏర్పాటు చేశామన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గం మొత్తంలో వెయ్యి కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులను ఒకేసారి ప్రారంభం చేయించిన ఘనత స్థానిక ఎంఎల్‌ఎ ఆది శ్రీనివాస్‌కే దక్కుతుందన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ పనులు ఏం ఉన్నా అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని సిరిసిల్ల వైద్య కళాశాలకు రూ.166 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ, కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వమని గుర్తు చేశారు. ఐటి శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాటను ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఇచ్చిన మాటను సిఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారని అన్నారు. బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తమ చిరకాల కాంక్ష రాజన్న ఆలయంలో నిత్యాన్నదాన సత్రం నిర్మించాలని, దానికి రూ.35 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ముంపు ప్రజలకు అన్యాయం జరిగిందని, సియం ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే నాలుగేళ్లలో లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..

గత ప్రభుత్వం ఎగవేసిన బకాయిలు చెల్లిస్తూనే 30 సంవత్సరాల చిరకాల కోరిక నూలు డిపోను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నేతన్నకు బీమా పావల వడ్డీ పథకాలను చేనేత కార్మికులకు అమలు చేస్తున్నామన్నారు. ఎంఎల్‌సి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ విస్తరణకు రూ.200 కోట్ల నిధులు ఏకమొత్తంలో మంజూరు చేసిన సియంకు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. నియోజకవర్గం మొత్తానికి సుమారు వెయ్యికోట్లకు పైగా నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వేములవాడ అభివృద్ధి కోసం ప్రతి శాఖ మంత్రివర్యులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణ వాసుల చిరకాల కోరిక రోడ్డు విస్తరణ పనులకు రూ.47 కోట్లనిధులు మంజూరు చేసిన సియం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్‌పి అఖిల్ మహజన్, అన్ని శాఖల అధికారులతో పాటు నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News