Monday, April 7, 2025

ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. నేడు జంతర్ మంతర్ వద్ద 12 బిసి సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే మహాధర్నాలో సిఎం, మంత్రులు, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీలు పాల్గొననున్నారు. విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లలను ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఆ బిల్లులను పార్లమెంట్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు ఈ మహాధర్నాకు సిద్ధమయ్యాయి. ఈ ధర్నాలో బిఎస్పీ, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ తదితర పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు సైతం ఢిల్లీకి వెళుతున్నారు.

దీంతోపాటు పార్లమెంట్‌లో నేడు వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనున్న సందర్భంగా తెలంగాణ ఎంపిలకు సిఎం రేవంత్‌రెడ్డి సంఘీభావం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మహాధర్నా అనంతరం కేంద్రమంత్రులు, జాతీయపార్టీ నేతలను కలిసి బిసి రిజర్వేషన్‌ల పెంపు చట్టానికి మద్ధతు తెలపాలని తెలంగాణ మంత్రుల బృందం విజ్ఞప్తి చేయనుంది. దీంతోపాటు త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఈ అంశం కూడా ఈ ఢిల్లీ పర్యటనలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాగూర్, ప్రకాశ్‌గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లు సైతం ఢిల్లీకి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News