ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. సిఎం రేవంత్ రెండు రోజులు పాటు అక్కడే ఉండే అవకాశం ఉందని పిసిసి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 7, 8 తేదీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక తుది రూపానికి వచ్చే అవకాశం ఉందని పిసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 7,8 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటుండడంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ పిసిసిఅధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోర్ కమిటీ మొత్తం ఢిల్లీలో అందుబాటులో ఉండడం వల్ల ఏఐసిసితో చర్చించి అభ్యర్థులు ఎంపికపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏఐసిసి క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే జాబితా
ప్రధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏఐసిసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్ద కోర్ కమిటీ సమావేశమయ్యింది. అభ్యర్థుల ఎంపిక కోసం అనుసరించాల్సిన విధి, విధానాలపై దాదాపు గంట పాటు చర్చ కొనసాగింది. విధి, విధానాలకు లోబడి ఉన్న ఆశావహుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అర్హులను సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించే విధంగా జాబితాను సిద్ధం చేసి ఏఐసిసికి నివేదించనున్నారు. ముఖ్యమంత్రితో కూడిన కోర్ కమిటీ నివేదించిన జాబితాను ఏఐసిసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది.