Sunday, November 17, 2024

అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :అమరవీరులను గుర్తించేందుకు కమిటీ వేసి వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం విలేకరులతో సిఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ వ స్తారని ఆశిస్తున్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కేంద్రంలో ఇండియాకూటమే అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 9 నుంచి 12 ఎంపి స్థా నాలు, రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణకు నాలుగు కేంద్రమంత్రి పదవులు అడుగుతానని ఆయన తెలిపారు.

ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తానని ఆయన తెలిపారు. కెసిఆర్ చెప్పినట్టు సెక్రటేరియట్ బయట కాకుండా సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ తెలిపారు. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించేందుకు బాధ్యతలను అప్పగించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణను వ్యాపార వస్తువుగా మార్చి కెసిఆర్ లాభం పొందాలని చూశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసిసి కంటే ఏఐసిసి నిర్ణయమే ఫైనల్ అని ఆయన తెలిపారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన రాజులుగా కాకతీయులను చూస్తానన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో ఏదైనా ఉంటే అందెశ్రీ చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

ఎరువులు, విత్తనాలు రైతుల డిమాండ్ మేరకు….
రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని, లోకల్ లీడర్లు, కింది స్థాయి అధికారులను పట్టుకొని హరీష్ రావు చిల్లర డ్రామాలు చేస్తున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని, రైతులు ఒకే బ్రాండ్ ను కోరుతున్నారన్నారు. ఎరువులు, విత్తనాలను రైతుల డిమాండ్ మేరకు 10 శాతం అధికంగా తీసుకొచ్చామని ఆయన తెలిపారు. కాళేశ్వరం, మేడిగడ్డపై ఎన్డీఏస్‌ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కెసిఆర్‌కు గౌరవం లేదు
భిన్నాభిప్రాయాలు ఉన్నా అవతరణ వేడుకలకు కెసిఆర్ రావాల్సి ఉందని సిఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాని కెసిఆర్ అసెంబ్లీ వస్తారా అని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కెసిఆర్‌కు గౌరవం లేదన్నారు. భారత దేశ స్వాతంత్ర విషయంలో పాకిస్తాన్ ఒకరోజు ముందుగానే వేడుకలు చేసుకుంటున్నట్టు కెసిఆర్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అఖిలపక్షంలో పిలుద్దాం అనుకుంటే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డెక్కి మాట్లాడిన వారిని పిలిస్తే అఖిలపక్షానికి వచ్చి కొత్తగా చెప్పేది ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ లోగోలో అమరవీరుల స్థూపం ఉండవద్దా అని ఆయన అన్నారు. అమరవీరుల కుటుంబాలపై కెసిఆర్ కుటుంబానికి అక్కసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. లోగోలో అమరవీరుల స్థూపం పెట్టినా వారు సహించలేక పోతున్నారని ఆయన విమర్శించారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం, కొత్త ప్రభుత్వ లోగోను ఒకేసారి ఆవిష్కరిస్తామన్నారు.

త్వరలోనే కులగనణను చేపడతాం
వేడుకలకు అందర్నీ పిలిచామని, బిజెపిని ఇగ్నోర్ చేయలేదని ఆయన తెలిపారు. రూ. 1000 కోట్లతో అమరవీరుల స్థూపం కట్టాలని గతంలోనే తాను డిమాండ్ చేశానని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి దానికి ఎన్నికల కమిషన్ అనుతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా ముళ్లకంచెలు వేయలేదని, రాష్ట్రంలో విద్య, స్పోర్ట్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. బిసి కుల గణన చేసేందుకు కసరత్తు ప్రారంభించామని, త్వరలోనే కులగనణను సైతం చేపడతామని ఆయన పేర్కొన్నారు.

కెసిఆర్‌ను దారికి తెచ్చుకోవడానికే సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని సిఎం రేవంత్ ప్రశ్నించారు. అప్పుడు సిబిఐ విచారణ ఎందుకు జరపలేదని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఎన్నికల కోడ్ ముగియగానే సమీక్ష నిర్వహిస్తామని సిఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ పోలీసుల ఆత్మస్థైరం దెబ్బతినేలా బిజెపి వ్యవహారిస్తోందని ఆయన మండిపడ్డారు. కెసిఆర్‌ను దారికి తెచ్చుకోవడానికే బిజెపి సిబిఐ విచారణ కోరుతుందని ఆయన ఆరోపించారు. నయీం ఆస్తులపై ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు వస్తే విచారణ అధికారికి సిఫార్సు చేస్తానని సిఎం రేవంత్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News