Thursday, January 23, 2025

సొంత పెట్టుబడులకే సిఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదు
ఈనెల 22న ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలి
రామ మందిరం ప్రారంభంపై విపక్షాలు విమర్శలు మానుకోవాలి: ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

మన తెలంగాణ/హైదరాబాద్:  విదేశీ పర్యటనలకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకే వెళ్తున్నారని, తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి కాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఒకవైపు పెట్టుబడుల కోసం అదానీ బృందంతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పుతూ ఆ పెట్టుబడులు ఎక్కడికి పోయాయనేదానిపై స్పష్టతనివ్వడం లేదని దుయ్యబట్టారు.  తమ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు రాములు, మురళీధర్‌గౌడ్‌తో కలిసి మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి అదానీ బృందంతో సమావేశమై తిరిగి అదానీ, అంబానీ, నరేంద్ర మోడీపై రాజకీయ విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడంలో భాగమేనని ప్రజలు గమనించాలని కోరారు.

తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పిన గత ప్రభుత్వం ఆ పెట్టుబడులు ఎక్కడికి వెళ్లాయో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో భాగంగా దావోస్‌లో పర్యటించి అదానీ గ్రూప్ తో సమావేశమై రూ. 12 వేల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు సమయం దొరికినప్పుడు బిఆర్‌ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అదానీ, అంబాని, ప్రధానిపై అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. దేశ సంపదను దోచిపెడుతున్నట్లుగా పదేపదే విమర్శలు చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారన్నారు. ఈ నెల 22వ తేదీ యావత్ భారత జాతి ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న రోజని, అయోధ్యలో భవ్య, దివ్య మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం జరుగుతున్న క్రతువు ప్రారంభమైతుందని తెలిపారు.

రామమందిరం విషయంపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, భారతదేశ పౌరుల మనోభావాలను ఈ పార్టీలు ఏనాడు గౌరవించలేదని ఆరోపించారు. రాముడు జన్మస్థలం అయోధ్య అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి ముందడుగు వేసిందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కళ్లు తెరవకుండా కుహనా లౌకికవాదం, అవకాశవాద ధోరణిని అవలంభిస్తూ విమర్శలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. ఇప్పటికైనా భారత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పవిత్ర దినం దృష్టిలో పెట్టుకుని, చిరకాల వాంఛ నెరవేరుతున్న భారతీయుల మనోభావాలను గౌరవించేలా అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నుంచి అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టాపన కోసం సంప్రదాయబద్ధంగా చేయాల్సిన సత్కార్యాలు, ఆభరణాలు, వస్త్రాలను అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకురావాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News