Friday, January 24, 2025

వచ్చేనెలలో సిఎం రేవంత్ దావోస్ పర్యటన

- Advertisement -
- Advertisement -

పెట్టుబడులను మరింత ఆకర్శించేలా వ్యూహాలు
రూ.50 నుంచి 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు
ఈ సంవత్సరం జనవరిలో 200 సంస్థలతో సంప్రదింపులు…
రూ.40,232 కోట్ల పెట్టబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిన సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్శించేలా సిఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన కొనసాగనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ జనవరిలో సిఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా సుమారుగా రూ.42 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే వచ్చేనెలలో సిఎం రేవంత్ దావోస్ పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి నుంచి పెట్టుబడులు సుమారుగా రూ.50 నుంచి రూ.80 వేల కోట్ల వరకు తెలంగాణకు వచ్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఏయే ప్రాంతాలు, ఏయే కంపెనీలకు అనుకూలం, గతంలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు వాటి అభివృద్ధి తాలుకు వివరాలకు సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందించినట్టుగా సమాచారం. ముఖ్యంగా మెడికల్ టూరిజం, ఐటీ సంస్థల పెట్టుబడులను మరింతగా రాబట్టాలని ప్రభుత్వం వ్యూహాలను రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. ఈ పెట్టుబడుల వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

గతేడాది కన్నా ఈ సంవత్సరం రెండింతల ఒప్పందాలు
ఈ సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌లో పర్యటించి 200ల సంస్థలతో సంప్రదింపులు జరిపి సుమారుగా రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. గతేడాది (2023) దావోస్‌లో తెలంగాణ సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలుగా ప్రభుత్వం పేర్కొంది. అదానీ గ్రూప్, జెఎస్‌డబ్లూ, వెబ్ వర్క్, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాసూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

గతేడాది రూ. 19,900 కోట్లు
గతేడాది అప్పటి పరిశ్రమల మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో జరిగిన దావోస్ సమ్మిట్‌లో రూ. 19,900 కోట్ల మేరకు పెట్టుబడులపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడగా, దానికి ముందు సంవత్సరం (2021) రూ. 4,128 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం జనవరిలో మూడురోజుల్లో సుమారుగా రూ. 40,232 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. గడిచిన మూడు సంవత్సరాల్లో (2020 నుంచి -23) వరకు వచ్చిన మొత్తం (రూ. 24,528 కోట్లు)తో పోలిస్తే రూ. 15,704 కోట్లు ఎక్కువగా అధికారులు తెలిపారు.
సంవత్సరం కోట్లలో…
2020 రూ.500
2022 రూ.4,128
2023 రూ.19,900
2024 రూ.40,232

దావోస్ పర్యటనకు రూ.12 కోట్ల నిధులు విడుదల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నిమిత్తం సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతినిధులు బృందం దావోస్‌లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన నిమిత్తం ఐటీ శాఖ బడ్జెట్ నుంచి రూ.12.30 కోట్లు మంజూరు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్‌లో సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 2024 జనవరిలో జరిగిన ఈ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించారు.

దావోస్ పర్యటనకు ముగ్గురు సిఎంలు
జనవరి నెలలో జరిగే దావోస్ పర్యనటకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలు హాజరు కానున్నారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల సిఎంలతో పాటు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఈ ముగ్గురు కలిసి భారత్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు హాజరు కానున్నారు. అలాగే ఈ సదస్సుకు ఎపి మంత్రి లోకేష్ కూడా హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News