Wednesday, January 22, 2025

‘మహా’లో అతిచిన్న కేబినెట్!

- Advertisement -
- Advertisement -

CM Shinde Expands Cabinet Over 40 Days మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం నాడు 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు 40 రోజుల సుదీర్ఘ వ్యవధి పట్టింది. మంత్రి పదవుల కేటాయింపులో ఆయన ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని ఇది చాటుతున్నది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులున్నారు. ప్రతి వంద మంది శాసన సభ్యులకు 15 మంది మంత్రులుండే వీలున్నది. ఆ లెక్కన మంత్రివర్గంలో గరిష్ఠంగా 43 మంది వుండవచ్చు. ఇంకా 23 మందిని నియమించుకునే అవకాశం వుంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య అపరిమితంగా వుందని బోధపడుతున్నది. వారందరినీ సంతృప్తి పరచడం కష్టసాధ్యమైనందునే వారిని ఆశల్లో కొనసాగించే ఆలోచనతో పరిమిత సంఖ్యలో మంత్రివర్గాన్ని సరిపుచ్చినట్టు అర్థమవుతున్నది. ఈ ఏర్పాటు ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. షిండే వర్గంలోని కనీసం డజను మంది తిరుగుబాటు శివసేన సభ్యులు తమను మంత్రివర్గలో చేర్చుకోనందుకు అసంతృప్తితో రగులు తున్నారు. బిజెపి ఏక్‌నాథ్ షిండేను ప్రయోగించి శివసేనను చీల్చడం మరాఠా ప్రజలకు కోపం తెప్పించింది. ముఖ్యమంత్రి పదవీచ్యుతుడైన ఉద్ధవ్ థాకరే పట్ల శివసైనికుల్లో సానుభూతి పెల్లుబికింది.

దీనిని గమనించిన బిజెపి దేవేంద్ర ఫడ్నవీస్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయకుండా జాగ్రత్తపడింది. అక్కడితో శివసైనికులు శాంతించలేదు. అందుకే మంత్రివర్గ నిర్మాణానికి ఇంత సమయం తీసుకోడంలో, 18 మందికే కేబినెట్‌ను పరిమితం చేయడంలోనూ అదే జాగ్రత్త కనిపిస్తున్నది. పూర్తి స్థాయి కేబినెట్‌ను నెలకొల్పడానికే ఇంత తర్జనభర్జన పడుతున్న బిజెపి షిండే వర్గ శివసేన రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాయోననే అనుమానాలు వ్యక్తం కావడం సహజం. మహారాష్ట్రలో ఇక ముందు బిజెపి పాచికలు పారడం సులువు కాబోదనే అభిప్రాయమూ కలుగుతున్నది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు గాని మంత్రి పదవుల కేటాయింపును మిగిల్చారు. అది నేడో రేపో జరుగుతుందంటున్నారు. హోంశాఖను ఫడ్నవీస్‌కు కేటాయించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇతర శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రి షిండేకి తలనొప్పులు తప్పవని రూఢి అవుతున్నది. మంత్రివర్గంలో చేర్చుకున్న 18 మందిలో బిజెపి, షిండే శివసేన తరపున చెరిసగం మంది వున్నారు. వీరిలో 17 మంది ఇంతకు ముందు మంత్రులుగా చేసినవారే.

పాలక కూటమిలో 14 మంది మహిళా ఎంఎల్‌ఎలు, ఒక ఎంఎల్‌సి వున్నారు. వీరిలో బిజెపికి చెందిన వారు 12 మందికాగా, ఇద్దరు తిరుగుబాటు శివసేన ఎంఎల్‌ఎలు, ఒకరు ఇండిపెండెంట్. అయినా ఒక్క మహిళను కూడా మంత్రివర్గంలో చేర్చుకోలేదు. బిజెపికి మహిళల పట్ల వున్న చిన్నచూపుకి దీనిని నిదర్శనంగా తీసుకోవచ్చు. సెప్టెంబర్‌లో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు. దాని సాధ్యాసాధ్యాలు కూడా అనుమానమే. ఈ కొద్ది మందితో కూడిన మంత్రుల జట్టులోనే ఒకరిద్దరిపై తీవ్ర విమర్శలు వినవచ్చాయి. ముఖ్యమంత్రి షిండే వర్గానికి చెందిన సంజయ్ రాథోడ్‌ను, అబ్దుల్ సత్తార్‌ను చేర్చుకోడం పట్ల అభ్యంతరం వ్యక్తమైంది. పుణెకు చెందిన 23 ఏళ్ల బంజారా మహిళ పూజా చవాన్ మృతికి కారకుడైన రాథోడ్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం దురదృష్టకరమని, మంత్రి అయినప్పటికీ ఆయనపై తన పోరాటం ఆగదని రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలు చిత్రా వాగ్ ప్రకటించారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో రాథోడ్ మంత్రిగా పని చేశారు. పూజా చవాన్ మృతితో సంబంధమున్నదన్న ఆరోపణ రావడంతో ఆయనను తొలగించాలని బిజెపి ఒత్తిడి తెచ్చింది. దానితో 2021లో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. బిజెపి దృష్టిలో అప్పుడు దోషి అయిన వ్యక్తి ఇప్పుడు అది భాగస్వామిగా వున్న ప్రభుత్వంలో మంత్రి పదవికి అర్హుడు కావడం గమనార్హం.

ఇది దాని అవకాశవాద రాజకీయానికి ప్రబల నిదర్శనం. మరో మంత్రి సత్తార్ పైన కూడా అవినీతి ఆరోపణలు వున్నాయి. టెట్ (టీచర్ ఉద్యోగానికి అర్హత పరీక్ష) పరీక్షల్లో ఆయన తన ఇద్దరు కుమార్తెలను దొడ్డి దారిలో పాస్ చేయించుకున్నారనే ఆరోపణ వున్నది. అలాగే బిజెపికి చెందిన విజయ్ కుమార్ గవిడ్ ను మంత్రివర్గంలోకి తీసుకోడాన్ని ఆక్షేపిస్తున్నారు. సుదూర గతంలో కాంగ్రెస్ ఎన్‌సిపి ప్రభుత్వంలో మంత్రిగా వున్నప్పుడు భారీ ఎత్తున నిధుల కైంకర్యం కేసులో ఆయనను దోషిగా ఒక దర్యాప్తు కమిషన్ నిర్ధారించింది. ఇంత చిన్న మంత్రివర్గ నిర్మాణంలోనే ఇన్ని అవకతవకలు ండడం షిండే ప్రభుత్వం మీద నీలినీడలు పరుస్తున్నది.ఆ ప్రభుత్వం చివరి వరకు కొనసాగుతుందా అనే అనుమానానికి అవకాశమేర్పడుతున్నది. దేనినైనా కూల్చినంత తేలికగా నిర్మించడం కష్టసాధ్యమని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు క్రమం నిరూపిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News