గౌహతి: మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించడం అమానవీయ చర్య అని, అత్యంత ఆందోళన కలిగించే విషయమని ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పౌర హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల ఆదివారం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన వైఫల్యాన్ని అంగీకరించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. కంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్ననంగా ఊరేగించిన వీడియోను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు ఆగలేదని బెంగళూరునుంచి పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
‘ఈ విషయంలో మణిపూర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం పరిస్థితిని కంట్రోల్ చేయలేనప్పుడు ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన మణిపూర్ ప్రజలకు రక్షణ కల్పించాలి. మణిపూర్ ప్రజల కష్టాల పట్ల ఆయన ఆందోళన చెందుతూ ఉంటే ఆయన తప్పతకుండా జోక్యం చేసుకోవాలి. గుజరాత్ ప్రజల మాదిరిగానే మణిపూరీలకు కూడా ఆయన నాయకత్వం కావాలి’అని ఇరోమ్ షర్మిల ఆ ఇంటర్వూలో చెప్పారు.