దివ్యాంగుడైన దళితునికి కేటాయించిన స్థలంలో ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గతంలో డిప్యూటీ సిఎంగా ఉన్నప్పుడు అక్రమంగా ఇల్లు కట్టుకున్నారని కేంద్ర మంత్రి జెడి (ఎస్)నేత హెచ్‌డి కుమారస్వామి శనివారం ఆరోపించారు. సిద్దరామయ్య అక్రమంగా మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముద్ర) లేఅవుట్ లోని 14 స్థలాలను తన భార్యకు కేటాయించడమే కాక, దళితునికి కేటాయించిన స్థలంలో స్వయంగా సిద్ధరామయ్యే ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఆ స్థలాన్ని దళితుడైన దివ్యాంగునికి కేటాయించడమైందని, ఈ మేరకు సదరు లబ్ధిదారుడు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముద్ర)కి రూ. 24,000 చెల్లించడం కూడా జరిగిందని కుమారస్వామి వివరించారు. “సాకమ్మ పేరున బోగస్ డాక్యుమెంట్లు పుట్టించి ఆ స్థలంలో మీరు (సిద్దరామయ్యను ఉద్దేశించి) సాకమ్మ నుంచి 10,000 చదరపు అడుగుల స్థలం పొందడమే కాకుండా ఇల్లు కట్టుకున్నారు” అని కుమారస్వామి ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై ఆరోపణలు చేశారు.
“ఆ దళితుడు వచ్చి చూస్తే తన స్థలంలో ఎవరో ఇల్లు కట్టుకున్నారని బాధపడతాడు” అని వ్యాఖ్యానించారు. “అప్పుడు జరిగిన అభివృద్ధి పనులను ప్రజలు మర్చిపోవచ్చు. కానీ కుమారస్వామి దగ్గర ఇంకా ఆనాటి డాక్యుమెంట్లు ఉన్నాయి.ఆయన (సిద్ద రామయ్య) పదేపదే తన జీవితం తెరిచిన పుస్తకం అని చెబుతుంటారు. ఆ పుస్తకాన్ని తెరిచి, ఆ స్థలాన్ని తరువాత ఎవరికి అమ్మారు? ఎవరి పేరున ఇంకా ఆ స్థలం ఉంది ? కేవలం పేరుకే బయటివారికి అమ్మినట్టు చూపించారు. మరో రామాయణ ప్రారంభమవుతుంది ” అని కుమారస్వామి నిలదీశారు. ముద్ర స్కామ్‌పై గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ఆరోపణలు చేవారు. కర్ణాటక డిప్యూటీసిఎంగా సిద్దరామయ్య 1996 నుంచి 1999 వనరే . 2004 నుంచి 2005 వరకు జనతాదళ్, జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వాల కాలంలో పనిచేశారు. అయితే ఎప్పుడు ఇదంతా జరిగిందో కుమారస్వామి నిర్దిష్టంగా చెప్పలేదు.