Sunday, December 22, 2024

హిజబ్‌పై నిషేధం తొలగించామని చెప్పలేదు: సిఎం సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

మైసూరు: రాష్ట్రంలోని విద్యా సంస్థలలో హిజబ్ ధారణపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం వివరించారు. ప్రభుత్వ స్థాయిలో చర్చించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. హిజబ్‌పై నిషేధాన్ని ఇంకా తొలగించలేదని శనివారం నాడిక్కడ విలేకనులతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తాను హిజబ్‌పై నిషేధాన్ని తొలగించే విషయాన్ని పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్పానని ముఖ్యమంత్రి వివరించారు. ఈ విద్యా సంవత్సరంలోనే ఇది జరుగుతుందా అన్న ప్రశ్నకు ప్రభుత్వ స్థాయిలో దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యా సంస్థలలో హిజబ్(తలపై మతపరమైన వస్త్రం ధరించడం)పై ఉన్న నిషేధం ఇక లేదని, ఎవరికి ఇష్టమైన దుస్తులు వారు వేసుకోవచ్చని, ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చని అన్నారు.

అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రతిపక్ష బిజెపి నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. విద్యా సంస్థల లౌకిక స్వరూపం ఈ నిర్ణయంతో మారిపోతుందని బిజెపి ఆందోళన వ్యక్తం చేసింది. కర్నాటక బిజెపి అధ్యక్షుడు బివై విజయేంద్ర న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్నాటకలో విద్యాలయాల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా మైనారిటీలలో విద్య, ఉపాధి రంగాలలో వృద్ధి 50 శాతం కూడా లేదని ఆయన అన్నారు. మైనారిటీల స్థితిగతులను మార్చడానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు. బ్రిటిష్ పాలకులు అవలంబించిన విభజించు పాలించు విధానాన్నే కాంగ్రెస్ కూడా నమ్ముతుందని, బ్రిటిషర్ల పాలనా పరంపరను కాంగ్రెస్ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News