మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ప్లాట్ల కేటాయింపుకుంభకోణంలో తనపైన తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్ష బిజెపి, జెడిఎస్ ప్రయత్నిస్తున్నాయని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. అటువంటి కుటిల యత్నాలకు తాను లొంగిపోయే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తనపై చేస్తున్న ఆరోపణలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. హెచ్‌డి కుమారస్వామి, బిఎస్ ఎడియూరప్ప, బివై విజయేంద్ర, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోకలతోసహా ప్రతిపక్ష నాయకుల అవినీతి గుట్టును బటయపెడతానని, వారు పాల్గొన్న కుంభకోణాలను బయటపెట్టి దర్యాప్తు నివేదికల ఆధారంగా వారిపైన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
ముడా కుంభకోణంపై ప్రతిపక్షాలు చేసిన పాదయాత్రకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జనాందోళన సభలను నిర్వహించిందని తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్ష నాయకులు పాదయాత్ర చేస్తున్నారని తాము ప్రజలకు తెలియచేశామని సిద్దరామయ్య అన్నారు. సిద్దరామయ్య ప్రతిష్టపై మచ్చ వేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని, ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి వారు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా తనను అణచివేయగలమని ప్రతిపక్ష నాయకులు భ్రమపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వారు(ప్రతిపక్షం) అధికారంలో ఉండగా అనేక కుంభకోణాలు జరిగయాని, వాటిని వెలుగులోకి తీసుకువచ్చి కుంభకోణాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.