చెన్నై : గవర్నర్ పదవి నుంచి తొలగించేందుకు ఆర్‌ఎన్ రవి అర్హులని పేర్కొంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘాటుగా లేఖ రాశారు. గవర్నర్ పాల్పడిన ఉల్లంఘనల జాబితాను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అరెస్టయిన మంత్రి సెంధిల్ బాలాజీని ఏకపక్షంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, గంటల వ్యవధిలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తదితర అంశాలు లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం ముఖ్యమంత్రికే ఉంటుందని గుర్తు చేశారు.
గవర్నర్ రవి తన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, రాష్ట్ర ప్రజలకు , ప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో స్టాలిన్ ఆరోపించారు.ప్రతిపక్ష పార్టీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కోసం వెతుకుతున్న గవర్నర్‌ను కేంద్రానికి ఏజెంట్‌గా మాత్రమే తాము చూస్తామని అందులో పేర్కొన్నారు. డీఎంకెప్రభుత్వంతో గవర్నర్ రాజకీయ యుద్ధం చేస్తున్నారని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోరిన మేరకు వివరణలు ఇచ్చినా సభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారని , తద్వారా శాసనసభ విధులకు అవరోధాలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు