చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నూతన సంవత్సర కానుక ప్రకటించారు. ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లకు కరవు భత్యాన్ని పెంచుతూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం 34 శాతంగా ఉన్న డీఏను 38 శాతానికి పెంచిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం ఈరోజు అంటే జనవరి 1 నుంచే అమలు లోకి వస్తుందని వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
డీఏ పెంపుతో ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2359 కోట్ల మేరకు అదనపు భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు సమానపనికి సమాన వేతనం కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళనల అంశంపై కూడా సిఎం స్పందించారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.