నాగపట్నం:తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతినుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటుగా ఉదయం అల్పాహారాన్ని కూడా అందించే విధంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దేశంలోనే విద్యార్థులకు పాఠశాల్లో అల్పాహారాన్ని అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడు కావడం గమనార్హం. నాగపట్నం జిల్లాలోని తిరువళై పంచాయతీ పాఠశాలలో ఈ స్కీం రెండో విడతను ప్రారంభించిన సిఎం స్టాలిన్ చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.అనంతరం పిల్లలకు స్వయంగా అల్పాహారాన్ని వడించిన ముఖ్యమంత్రి తాను కూడా వారితో కలిసి అల్పాహారం తిన్నారు.
చెన్నైలో స్టాలిన్ కుమారుడు, రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ఈ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి ఈ పథకాన్ని గత ఏడాది నవంబర్‌లోనే ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం ప్రయోగాత్మకంగా 1545 పాఠశాలల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆకలి బాధలు లేకుండా పిల్లలు పాఠశాలలకు హాజరయ్యేలా చూడడంతో పాటుగా వారిలో తీవ్రప్రభావం చూపుతున్న రక్త హీనతను బాగా తగ్గించడం,పోషకాహార స్థితిని మెరుగుపర్చడం, పాఠశాల్లో హాజరును పెంచడం వంటి లక్షాలతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా31,008 పాఠశాలలకు దీన్ని విస్తరించారు.ఈ స్కూళ్లలో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులున్నారు.