జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడుకేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది. యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు ప్రమాదంలో పడింది. కాబట్టే స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి విమర్శలు చేశారు. వీటిపై స్టాలిన్ స్పందించారు. “ తమిళనాడు రాష్ట్రం తమ ద్విభాషా విధానం, నియోజకవర్గాల పునర్విభజన పై న్యాయమైన, దృఢమైన స్వరాన్ని వినిపిస్తోంది.
దీనిపై కలవరం చెందుతోన్న బీజేపీ తన నేతలతో రకరకాలుగా మాట్లాడిస్తోంది. విద్వేషం అంశంపై యోగీజీమాకు పాఠాలు నేర్పాలనుకుంటున్నారా ? మమ్మల్ని వదిలేయండి. ఇది రాజకీయంగా అత్యున్నత స్థాయి డార్క్ కామెడీ. మేం ఏ భాషను వ్యతిరేకించం. కానీ బలవంతంగా రుద్దడాన్ని అంగీకరించం. ఇది న్యాయం కోసం జరుగుతోన్న పోరాటం ’ అని కౌంటర్ ఇచ్చారు. “ ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తోన్న రాజకీయాలు అర్థమయ్యాయి. ఆ విషయాన్ని మీరు గ్రహించకపోవడం దురదృష్టకరం.” అంటూ స్టాలిన్ పోస్ట్‌పై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స్పందించారు.