మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రెండేళ్లుగా భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ రాష్ట్ర ప్రజల జీవితంలో ఈ పరిణామం ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పునూ తీసుకురాకపోవచ్చు. శాంతిభద్రతలు ఇప్పటికిప్పుడు గాడిన పడకపోవచ్చు కానీ, హింసాయుత వాతావరణం నెలకొన్నచోట ఓ శాంతి సుమం విచ్చుకునేందుకు దోహదపడవచ్చు. నెల రోజుల క్రితం కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలనుద్దేశించి బీరెన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని పరోక్షంగా అంగీకరించారు. జరిగిన దానికి ప్రజలను క్షమాపణ కోరారే తప్ప రాజీనామా చేస్తాననే మాట ఆయన నోటి వెంట రాలేదు. మరి, నెల రోజులు గడిచేసరికి ఆయనలో ఇంత మార్పు ఎలా వచ్చినట్టు? దీనికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది.
అదే సమయంలో సొంత పార్టీ ఎంఎల్‌ఎలే తమ నేతపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే వారంతా విప్‌ను సైతం ధిక్కరించి, తీర్మానాన్ని గట్టెక్కించేందుకు కూడబలుక్కుంటున్నారని అధిష్ఠానానికి ఉప్పందడంతో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను హుటాహుటిన దేశ రాజధానికి పిలిపించి, నయానా భయానా ఆయనను ఒప్పించి, రాజీనామా చేయించింది. లేకపోతే, మరికొంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉండేవారేమో. మరింత మంది అమాయకుల ప్రాణాలు అల్లర్లకు బలయ్యేవేమో! అన్నింటికీమించి బీరెన్ సింగ్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్పులు ఆయన ప్రతిష్ఠనే కాదు, ఆయనకు కొమ్ము కాస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠను కూడా మంటగలిపాయి. ఆడియో క్లిప్పుల వ్యవహారాన్ని కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సంస్థ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను దోచుకునేందుకు మైతేయీలకు అవకాశమివ్వండంటూ బీరెన్ సింగ్ ఆదేశిస్తున్నట్లుగా వినబడిన ఆ ఆడియో క్లిప్పులు దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఆ గొంతు అక్షరాలా బీరేన్ దేనంటూ హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించినా, బీరేన్ న్యాయవాదులు అభ్యంతరం చెప్పడంతో సదరు ఆడియో క్లిప్పులను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో బిజెపి అధిష్ఠానానికి పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లయింది. రెండేళ్ళుగా జాతుల సమరంతో ఒక రాష్ట్రం అతలాకుతలమవుతున్నా చూసీచూడనట్లు, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న కమలనాథుల వైఖరిని రాష్ట్ర ప్రజలు ఈసడించుకుంటున్నారు. విదేశీ పర్యటనలపై ప్రధానికి ఉన్న మక్కువ మణిపూర్‌పై లేదని, గత రెండేళ్ల కాలంలో ఆయన ఒక్కసారి కూడా మణిపూర్‌ను సందర్శించకపోవడం గర్హనీయమని దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలకు కమలనాథులు ఏం సమాధానం చెబుతారు? మణిపూర్‌లో విపక్షం అధికారంలో ఉండి ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఇలా మిన్నకుండేదేనా? 2023 మే నెలలో మైతేయిలు, కుకీల మధ్య మొదలైన వైరం ఇప్పటివరకూ 250 మందికి పైగా బలిగొంది.
సుమారు 60 వేల మంది నిరాశ్రయులై, సహాయక శిబిరాల్లో మగ్గుతున్నారు. వారి పిల్లలు చదువుసంధ్యలకు దూరమయ్యారు. ఇరు జాతులకు చెందినవారు బాంబులు, తుపాకులే కాదు, రాకెట్లు సైతం ప్రయోగిస్తూ సాధారణ జనజీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నా, అక్కడి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ కూర్చోవడం తప్పించి, అల్లర్లను అణచివేయడానికి ఇదమిత్థంగా తీసుకున్న చర్యలేమీ లేవు. బీరేన్ సింగ్ చేత రాజీనామా చేయించారు సరే. ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది కీలకమైన ప్రశ్న. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవారెవరైనా ప్రస్తుత సంక్షోభానికి చరమగీతం పాడగలిగే సత్తా ఉన్న నాయకుడై ఉండాలి. అల్లర్లకు కారణమైన ప్రధాన వర్గాల నేతలను చర్చలకు రప్పించడమే కాదు, రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులతోపాటు పౌరహక్కుల నేతలకూ చర్చలలో ప్రాతినిధ్యం కల్పించడం ముఖ్యం. అంతకంటే ముందు, ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లనుంచి అపహరించిన, అక్రమంగా కూడగట్టుకున్న ఆయుధాలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మైతేయిలు, కుకీల మధ్య సోదరభావం పాదుగొని, ఇకపై కలసిమెలిసి జీవించేందుకు అవసరమైన చర్యలు చేపడితే, నిరాశ్రయులైన ప్రజలు ధైర్యంగా స్వస్థలాలకు చేరుకోగలుగుతారు. మణిపూర్‌లో శాంతిసుమాలు విరబూసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.