ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను లక్ష్యంగా చేసుకొని మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తనపై పాటియాలా నుంచి పోటీ చేయాలని అమరీందర్ సింగ్కు సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యులు క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని అమరీందర్ హెచ్చరించారు. సిద్దూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? లేదా? అని ప్రశ్నించారు. పంజాబ్ పిసిసి అధ్యక్షుడు సునీల్ జఖర్ చక్కగా పని చేస్తున్నారని కొనియాడారు. సునీల్ స్థానంలో మరొకరిని తీసుకోవాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పారు. సిద్దు కాంగ్రెస్లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతోందని, యూత్ కాంగ్రెస్తో సిద్దూ కంటే అనుభవం ఉన్న యువత ఉందని ఎద్దేవా చేశారు. మంత్రులు సుఖ్జిందర్ సింగ్ రాంధవా, సునీల్ జఖర్ రాజీనామాలను ఆమోదించడంలేదని అమరీందర్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతా నుంచి సిద్దూ పేరు ముందు కాంగ్రెస్ పదం తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో రీకౌంటర్ గా సిద్దూ వ్యాఖ్యలు చేశాడు. అమరీందర్ కూడా ఫ్రంట్ ప్రారంభించారని, కేవలం అమరీందర్ వైఫల్యమేనని, ఇది ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదని సోషల్ మీడియాలో ఘాటు విమర్శలు చేశారు.