Wednesday, January 15, 2025

సిఎం x గవర్నర్ టగ్ ఆఫ్ వార్

- Advertisement -
- Advertisement -

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా స్థలాల పంపిణీలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడం కర్నాటక రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయా ల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య గవర్నర్ చర్య చట్టవ్యతిరేకమని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించిన తరువాత ఆగస్టు 29 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, గవర్నర్ ధావర్‌చంద్‌కు మధ్య టగ్ ఆఫ్ వార్ ప్రారంభమైంది. తాజాగా గవర్నర్‌కు కౌంటర్ స్ట్రాటజీగా నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) లోని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ బిజెపి మంత్రులు శశికళ జోల్లె, మురుగేష్ నిరానీ, జి. జనార్దన్ రెడ్డి ఈ నలుగురిపై పెండింగ్‌లో ఉన్న కేసుల ప్రాసిక్యూషన్‌పై సత్వర నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కర్ణాటక కేబినెట్ కోరుతూ సిఫార్సు చేసింది.

రాజ్యాంగం లోని 163 ప్రకారం పెండింగ్ కేసులపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ కోరుతూ నిర్ణయించిందని రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు. ఇది ప్రతీకార రాజకీయాలు కావని ఆయన స్పష్టం చేశారు. ఇది జవాబుదారీతనం కోసం పబ్లిక్ డిమాండ్‌పై బాధ్యత వహించడమేనని వివరించారు. రాజ్యాంగ ప్రాతిపదికన గవర్నర్‌కు సహకరించి సిఫార్సు చేయడమే కేబినెట్ పాత్రగా పేర్కొన్నారు. ముడా కేసులో అత్యంత ఉత్సాహం చూపించిన గవర్నర్ ఈ విషయంలో ఎందుకు అనుమతి ఇవ్వడానికి సంకోచిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేషంతో తనను టార్గెట్ చేసిందని తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరుగుతున్న కుట్రగా కేంద్రమంత్రి కుమారస్వామి విమర్శించారు. తనపై ఉన్న మైనింగ్ లీజు కేసు గురించి మాట్లాడుతూ ‘ఇది చనిపోయిన కేసు… నా సంతకం లేని కేసు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

వందమంది సిద్దరామయ్యలు కూడా నన్ను అరెస్ట్ చేయలేరని కుమారస్వామి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ప్రతిగా స్పందించారు. ‘అతన్ని అరెస్ట్ చేసేది పోలీస్‌లే.. నేను కాదు. అవసరమైతే ఒక కానిస్టేబుల్ సరిపోతారు’ అని సమాధానం ఇచ్చారు. ‘కుమారస్వామి వ్యవహారం హిట్ అండ్ రన్ కేసు’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌షెట్టర్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. తనపై వచ్చిన కేసులో రుజువు చూపకుండా కుమారస్వామి సీన్ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ లీజు కేసులో కుమారస్వామిపై ప్రాసిక్యూషన్ పెండింగ్‌లో ఉంది. 2007లో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉన్నప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి 24 మంది బిడ్డర్ల కంటే శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్‌కు మైనింగ్ లీజు మంజూరు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో మైనింగ్ యజమానుల నుంచి కుమారస్వామి రూ. 150 కోట్ల కిక్‌బ్యాక్‌లు పొందారని బయటపడింది.

దాంతో లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్) కేసు చేపట్టింది. మైనింగ్ లీజు ఫైలుపై కుమారస్వామి సంతకం ఫోరెన్సిక్ పరిశీలనకు కూడా వెళ్లింది. ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. 2024లో సిట్ దర్యాప్తు పూర్తయింది. సుప్రీం కోర్టుకు రిపోర్టులు దాఖలయ్యాయి. అయినప్పటికీ తుది తీర్మానాలు తీసుకోలేదు. దీంతో పది నెలల క్రితం 2023 నవంబర్‌లో కుమారస్వామిపై ప్రాసిక్యూషన్ కోసం సిట్ గవర్నర్‌కు అభ్యర్థన చేయగా ఫైల్‌పై ఉన్న సంతకంపై ఆందోళన కారణంగా గవర్నర్ సమీక్షకు ఆదేశించారని కుమారస్వామి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు 14న లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి గవర్నర్‌ను సంప్రదించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అండగా ఉద్యమం చేపట్టడానికి ప్లాను చేస్తోంది.

రాజ్‌భవన్‌లను బిజెపి దుర్వినియోగం చేస్తోందన్న నినాదంతో ఇండియా కూటమి భాగస్వాములతో ఆందోళనలు సాగించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ సమావేశంలో ప్రతిపాదించారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు పాలనా వ్యవహారాల్లో సంఘర్షణాత్మకంగా వ్యవహరించడం మోడీ ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య నిత్యం ఏదోఒక విషయంపై రాద్ధాంతం చెలరేగుతోంది. కర్ణాటకలోనే కాదు, కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు రాజకీయ ప్రత్యర్థులుగా గవర్నర్లు వ్యవహరించడం, చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని మందలించడం ఇవన్నీ తెలిసినవే. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ సివి ఆనందబోస్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య చాలా విషయాల్లో ప్రతిఘటన కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News