Monday, January 20, 2025

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో రామరాజ్యం మొదలవుతుంది

- Advertisement -
- Advertisement -

సుక్మా: అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో కులం, మతం ఆధారంగా విచక్షణకు తావు లేని ‘ రామరాజ్యం ప్రారంభమయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, కుళాయి నీళ్లు, ఆరోగ్య బీమాకు సంబంధించిన పథకాలను అమలు చేయడం ద్వారా అత్యున్నత స్థాయి రామరాజ్యానికి పునాది వేశారని కూడా ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొంటలో ఆదివారం జరిగిన బిజెపి ఎన్నికల సభలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లవ్‌జిహాద్, మత మార్పిడులను ప్రోత్సహించిందని ఆరోపించారు.‘ అయోధ్యలో రామమందిర నిర్మాణం జనవరిలో పూర్తవుతుంది. ఈ ఆలయం పూర్తయితే యుపి ప్రజలకన్నా చత్తీస్‌గఢ్ ప్రజలే ఎక్కువగా సంతోషిస్తారు.

ఎందుకంటే చత్తీస్‌గఢ్ శ్రీరాముడి నానిహాల్(అమ్మమ్మ చోటు). అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయితే దేశంలో రామరాజ్య ప్రకటన ప్రారంభమవుతుంది’ అని ఆదిత్యనాథ్ అన్నారు. ‘రామరాజ్యం అంటే కులం, మతం ఆధారంగా వివక్ష లేని పాలన. పథకాల ప్రయోజనాలు పేదలు, అణగారిన వర్గాలు, గిరిజనులు సహా అన్ని వర్గాలకు అందుతాయి. ప్రతి ఒక్కరికీ భద్రత, సదుపాయాలు, వనరులపై హక్కులు లభిస్తాయి. ఇదే రామరాజ్యం’ అని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించిన ఆయన ‘ఈ ప్రభుత్వం లవ్ జిహాద్, మత మార్పిడులు లాంటి కార్యకలాపాలను చూసీ చూడనట్లు ప్రవర్తిస్తోంది. ఇది ప్రభుత్వం కాదు, ప్రాబ్లమ్. చత్తీస్‌గఢ్ కలలను సాకారం చేయడానికి ఈ ప్రాబ్లమ్‌ను వీలయినంత త్వరగా వదిలించుకుని మాకు మద్దతు ఇవ్వండి’ అని రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. చత్తీస్‌గఢ్‌లో ఈ నెల 7 వతేదీ తొలి విడత పోలింగ్ జరిగే 20 స్థానాల్లో కొంట ఒకటి. ఆదివారం సాయంత్రంతో ఇక్కడ ప్రచారం ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News