విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు నష్టాలు
24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నాం
పిఆర్సీ కోసం కమిటీ అధ్యయనం చేస్తోంది
త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు అందిస్తాం
రానున్న రోజుల్లో విద్యుత్ సంస్థల్ని మరింత బలోపేతం చేస్తాం
ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు తీవ్ర నష్టాలు వస్తాయని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం, సిఎం కెసిఆర్ గతంలో వ్యతిరేకించడంతో పాటు అసెంబ్లీ తీర్మానం చేశారని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలను హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని జెన్‌కో కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఉద్యోగులతో పాటు సిఎండిలు, డైరెక్టర్‌లు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పీడిసిఎల్ సిఎండి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎండి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ఈ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. తెలంగాణ రాకముందు విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 13,168 మెగావాట్లుగా ఉందని ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తరువాత 14 పైచిలుకు దాటిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంస్కరణల నేపథ్యంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌తో పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, దీని వెనుక ఉద్యోగుల శ్రమ అధికంగా ఉందని ఆయన వెల్లడించారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు భారీగా వస్తున్నాయన్నారు.
జల విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తాం
త్వరలో విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు అందిస్తామని సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే పీఆర్సీ కమిటీ వేశామని, దీనిపై కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన తెలిపారు. జల విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లాయని ఆయన వెల్లడించారు. ఎన్పీడిసిఎల్ పరిధిలో భారీగా నష్టం జరిగిందని, ఎస్పీడిసిఎల్ పరిధిలో సుమారు రూ.10 కోట్ల నష్టం జరిగిందని ఉద్యోగులు, సిబ్బంది కష్టపడి విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరుద్ధరించారని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ సంస్థల్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం డిఈ నుంచిపైస్థాయి అధికారులతో విద్యుత్ వ్యవస్థ బలోపేతం నూతన ఆవిష్కరణల గురించి సమీక్ష నిర్వహించారు. వారి నుంచి సంస్థ బలోపేతానికి సలహాలు, సూచనలను స్వీకరించారు.
CMD Prabhakar Rao about Central Electricity Amendment Bill