Sunday, December 22, 2024

ఏడు రైస్ మిల్లులు..రూ.110 కోట్ల ధాన్యం

- Advertisement -
- Advertisement -

బోధన్: నిజామాబాద్ జిల్లాలో సిఎంఆర్ ధాన్యాన్ని మింగేసిన రైస్ మిల్లర్లు కక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి సిఎంఆర్ ధాన్యంతో వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు గడించిన అక్రమార్కులు ఇపుడు తాము వేసుకున్న ఉచ్చులో ఇరుక్కున్నారు. సిఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకొని వాటిని అమ్ముకుని ఆ ధాన్యం స్థానంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అంటగడుగడుతూ ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు గడిస్తున్న రైస్ మిల్లర్లు ఇపుడు అడ్డంగా దొరికిపోయారు. బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్, వర్ని, రుద్రూరు, చందూరు, మోస్రా, కోటగిరి మండలాల్లో రైస్ మిల్లర్లు ఈ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఏడు రైస్ మిల్లుల్లో 100 కోట్ల రూపాయల మేరకు సిఎంఆర్ ధాన్యం అక్రమాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిఎంఆర్ ధాన్యం అక్రమాలపై కొరడా ఝలిపించడంతో భారీ ఎత్తున అవినీతి వెలుగుచూసింది.

అధికారుల తనిఖీల్లో వారి వద్ద సిఎంఆర్ ధాన్యం నిల్వలు లేకపోవడంతో వాటి లెక్కలు అడిగితే చెప్పే పరిస్థితిలో లేక పరారీలో ఉండడంతో క్రిమినల్ కేసులకు దారితీసింది. వర్ని మండలంలోని ఎంఎస్‌ఆర్ రైస్ మిల్లు ఐదున్నర కోట్ల కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని మింగేసింది. ఇదే మండలంలోని హుమ్మాపూర్ రాయల్ రైస్ మిల్ యజమాని 600 కోట్ల సిఎంఆర్ ధాన్యాన్ని అమ్ముకున్నారు. వర్ని ఎస్‌ఎన్‌పురంలోని గంగా రైస్ మిల్ 8 కోట్ల సిఎంఆర్ ధాన్యం లెక్కలు లేకుండా పోయాయి. వర్నిలోని ఎస్వీఆర్ రైస్ మిల్లులో రూ.400 కోట్ల సిఎంఆర్ ధాన్యం మింగేశారు. వర్నికి చెందిన వశీరైస్ మిల్ రూ.26 కోట్ల సిఎంఆర్ ధాన్యం అమ్మేసింది. కోటగిరి మండలానికి చెందిన అక్రం రైస్‌మిల్ రూ.50 కోట్ల సిఎంఆర్ ధాన్యం కెక్కలు చూపలేదు. బోధన్‌లోని దాదాబాయి రైస్ మిల్లు ఐదు కోట్ల సిఎంఆర్ ధాన్యం నిల్వలు లేవు. మొత్తం ఏడు రైస్‌మిల్లుల్లో సుమారు రూ.110 కోట్ల సిఎంఆర్ ధాన్యానికి సంబందించి నిల్వలు లేకపోవడంతో వాటిని అమ్ముకున్నట్లు అధికారుల తనిఖీలో బహిర్గతమైంది.

రైస్ మిల్లుల యజమానులపై సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. రైస్ మిల్లుల వారీగా ఎన్ని కోట్ల సిఎంఆర్ ధాన్యం మింగేశారో వివరంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు క్రిమినల్ కేసులకు సిఫారసు చేశారు. వర్ని, కోటగిరి, బోధన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయా రైస్ మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వర్నికి చెందిన వంశీ రైస్ మిల్ యజమాని వసిని నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ముక్తార్ మక్సూద్, బాలకృష్ణ అనే రైస్‌మిల్లుల యజమానులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే వ్యవహారంలో మరో ఒకటి రెండు రైస్ మిల్లుపై జిల్లా సివిల్ సప్లయిస్ అధికారులు దృష్టిపెట్టారు.
క్రిమినల్ కేసులు ఆర్‌ఆర్ యాక్ట్ కేసులు పెడుతున్నాం.

జగదీశ్వర్, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్
‘సిఎంఆర్ ధాన్యాన్ని తీసుకుని అమ్ముకున్న ఏడుగురు రైస్ మిల్లర్లపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రిమినల్ కేసులకు ఫిర్యాదులు చేశాం. అందరిపై క్రిమినల్ కేసులతోపాటు ఆర్‌ఆర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే అన్ని కోణాల్లో క్షేత్రస్థాయిలో సిఎంఆర్ ధాన్యం నిల్వలను పరిశీలించాం. ధాన్యం అమ్ముకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశాం. ఏడు రైస్ మిల్లర్లలో సుమారు రూ.110 కోట్ల సిఎంఆర్ ధాన్యం అమ్ముకున్నట్లు లెక్కలు తేలాయి’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News