Wednesday, January 22, 2025

సిఎం అల్పాహారం విద్యార్థులకు వరం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటు న్న విద్యార్థులకు ‘సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం’ వరమని, దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎ క్కడా లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ప్ర భుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. ఈ పథకాన్ని వివిధ జిల్లాల్లో మం త్రు లు లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సిఎం అల్పాహార పథకాన్ని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం కేవలం విద్యార్థుల కడుపు నింపే కా ర్యక్రమం మాత్రమే కాదని, స్కూళ్లలో డ్రాపౌ ట్స్ తగ్గించి పిల్లలను బడిబాట పట్టించే పథకం అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం మం త్రి చెప్పారు. దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని, ఇది విద్యావ్యవస్థలో సమూల మార్పు తెస్తుందన్నారు. కేంద్రం 8వ తరగతి వరకు మాత్రమే మధ్యాహ్నం భోజనం అందిస్తుండగా, రాష్ట్రంలో మాత్రం 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలలో 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం లేదని, దేశంలో తెలంగాణలో మాత్రమే అందిస్తున్నామని పేర్కొన్నారు. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు అవుతుందని మంత్రి హరీశ్ తెలిపారు.
విద్యార్థుల్లో రక్తహీనత తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది
ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం అందించడం వలన విద్యార్థుల్లో రక్తహీనత సమస్యను తగ్గించి విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల తరుపున సిఎం కెసిఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించడం ద్వారా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఆడపిల్ల చదువుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.
మానవీయ కోణంలో ఆలోచించి సిఎం పథకాలు ప్రారంభిస్తారు
మఖ్యమంత్రి కెసిఆర్ ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా దానివెనక ఓ మానవీయ కోణం ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. ఆడ పిల్లల పెండ్లికి సహాయంగా అందించే కల్యాణ లక్ష్మి ద్వారా బాల్య వివాహాలు తగ్గాయని , కెసిఆర్ కిట్ పథకం ద్వారా ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగాయని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు అందించడం వలన సీజనల్ వ్యాధులు, జ్వరాలు, డెంగ్యూను అరికట్టడం జరుగుతుందని అన్నారు. సిఎం కెసిఆర్ మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ను ప్రారంభించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 27,147 ప్రభుత్వ పాఠశాలలో చదివే సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు బడి ప్రారంభానికి ఓ అరగంట ముందు అల్పాహారం అందించనున్నారని తెలిపారు. ఈ పథకం వల్ల పనులకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తగ్గుతుందని, వారికి బ్రేక్ ఫాస్ట్ విషయంలో వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.
పౌష్టికాహారంతో ఏకాగ్రత : మంత్రి సబిత
మానవీయ కోణంలో పేద విద్యార్థులకు ప్రవేశపెట్టిందే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెరిగి బాగా చదువుతారని చెప్పారు. పంచాయతీ రాజ్, మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖల సమన్వయంతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సుమారు రూ.7 వేల కోట్లు వెచ్చించి మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుమన్నామని చెప్పారు. ఉదయం టీ తాగి మాత్రమే బడికి వస్తున్నామని కొంతమంది విద్యార్థులు తనతో చెప్పారని మంత్రి గుర్తు చేశారు. పనులకు వెళ్లే తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలలో చాలావరకు విద్యార్థులు ఏం తినకుండా వస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి గుర్తించిన కెసిఆర్ సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారని చెప్పారు.
చిన్నారులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రులు
సిఎం కెసిఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి చిన్నారులతో కలిసి టిఫిన్ చేశారు.మంత్రులు విద్యార్థులకు టిఫిన్ తినిపించి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం వండిన పదార్థాలను రుచి చూసి మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పని దినాల్లో ప్రతి రోజు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించాలని, శుచి శుభ్రత పాటించాలని నిర్వాహకులకు సూచించారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రతి రోజు క్రమం తప్పకుండా బడికి వస్తూ చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హర్‌నాథ్ రెడ్డి, ఎంఎల్‌సిలు శంబీపూర్ రాజు, బొగ్గారపు దయానంద్, చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News