Wednesday, November 13, 2024

విదేశీ పర్యటన తరువాత క్యాంప్ ఆఫీసుపై సిఎం నిర్ణయం

- Advertisement -
- Advertisement -

‘పైగా ప్యాలెస్’లో కార్యాలయం ఏర్పాటుపై ముఖ్యమంత్రి విముఖత !
ఎంసిఆర్ హెచ్‌ఆర్డీలో కార్యాలయం ఏర్పాటుపై రేవంత్ ఆసక్తి
ఇప్పటికే ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో పనులు మొదలుపెట్టిన అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసు విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఎంసిఆర్ హెచ్‌ఆర్డీలోనే తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటారని సమాచారం. నిన్నటి వరకు ‘పైగా ప్యాలెస్’ను సిఎం క్యాంపు కార్యాలయంగా మార్చనున్నారని ప్రచారం జరిగింది. సిఎస్ శాంతికుమారి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇటీవలే ఈ ప్యాలెస్‌ను సైతం సందర్శించారు. ఈ ప్యాలెస్ సిఎం భద్రతకు సంబంధించి అనువుగా ఉంటుందని అధికారులు భావించారు. ఈ ప్యాలెస్ నుంచి సెక్రటేరియెట్‌కు ఐదు నిమిషాల్లో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చేరుకోవచ్చని అధికారులు సిఎంకు సూచించారు. ఈ ప్యాలెస్ సమీపంలో ఎలాంటి ఇళ్లు లేకపోవడంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. అయినా సిఎం ఈ ప్యాలెస్ వద్దని అధికారులకు సూచించినట్టుగా తెలిసింది.
ప్యాలెస్ వద్దు!
ప్రజల పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్యాలెస్‌లో క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం ఇందుకు విరుద్ధమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం. అధికారులు పైగా ప్యాలెస్ ను పరిశీలించి రిపోర్ట్ అందించినా అక్కడ ఉండేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తవని, ట్రాఫిక్ సమస్య ఉండదని అధికారులు చెప్పినా సిఎం విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
తాత్కాలిక నిర్మాణ పనులు ప్రారంభం
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం తాత్కాలిక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి మారనున్నట్టుగా తెలుస్తోంది.
వన్నె తగ్గని ‘పైగా’
ఆరో నిజాం మీర్ ఉస్మాన్ అలిఖాన్ వద్ధ ప్రధానిగా వ్యవహారించిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900 సంవత్సరంలో చిరాగ్‌లేన్‌లోని 4ఎకరాల విస్తీర్ణంలో పాయ్‌గా ప్యాలెస్‌ను నిర్మించారు. పాయ్‌గా వంశీస్తుడైన ఆయన పేరు మీద దీనిని పాయ్‌గా ప్యాలెస్ అని పిలుస్తున్నారు. కాలక్రమంలో దీనిపేరు (పైగా) ప్యాలెస్‌గా మారింది. ఈ ప్యాలెస్ యూరోపియన్ శైలీలో రెండస్తులతో నిర్మితమైంది. మొదటి అంతస్తులో 20 గదులుండగా ప్యాలెస్‌కు 22అడుగుల ఎత్తైన డోమ్‌పై కప్పు ఉంది. రెండో అంతస్తులో కలపతో చేసిన మెట్లను ఏర్పాటు చేశారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం పాయ్‌గా ప్యాలెస్‌ను హుడా కార్యాలయంగా వినియోగించారు. అనంతరం 2008లో అప్పటి సిఎం వైఎస్సార్ అమెరికా కాన్సులెట్ కార్యాలయానికి దీనిని కేటాయించారు. అమెరికా కాన్సులెట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో కొత్త భవనం నిర్మించుకొని తరలిపోవడంతో గతేడాది ఏప్రిల్‌లో తిరిగి ఈ ప్యాలెస్‌ను హెచ్‌ఎండిఏ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ ఖాళీగా ఉంది. దీనిని సిఎం కార్యాలయంగా వినియోగించేందుకు భవనం లోపల, వెలుపల తీసుకోవాల్సిన సదుపాయాలపై అధికారులు దృష్టి సారించి అందుకోసం నివేదిక సిద్ధం చేశారు. సిఎం మాత్రం ఎంసీహెచ్‌ఆర్డీలోనే క్యాంపు ఆఫీస్‌కు సిఎం సానుకూలత చూపినట్టుగా తెలిసింది.

MCRHRD

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News