తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ
రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు
జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు
ఫ్యాక్టరీ, కృష్ణా నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం విధానం
ప్రకటించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను మరోమారు టిఆర్‌ఎస్ సర్కారు కేంద్రం దృష్టికి తీసుకుపోయేందుకు సిద్దమైంది. ఆదివారం నాడు ఎపిలోని తిరుపతి వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతనే జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున హోమంత్రి మహ్మద్ అలీతోపాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్ హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి పరిస్థితి, విభజన చట్టం మేరకు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు , వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు , కృష్ణాగోదావరి నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా నీటి కేటాయింపులు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సిద్దం చేసుకుంది.. ఎపి పునర్‌విభజన చట్టం మేరకు 2014లో రాష్ట్ర ఏర్పాటు సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కొత్తరాష్టమైన తెలంగాణకు అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదు. పైగా విభజన చట్టంలో పొందు పరిచిన వాటిని కూడా తుంగలో తొక్కింది. ఐటిఐఆర్ ప్రాజెక్టు అతీగతీలేదు.
వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా పెట్టే అవకాశాల్లేవని కేంద్రం ప్రాధమికంగా నిర్ణయం తీసుకోవటం పుండుమీద కారం చల్లినట్టుగావుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని కూడా కేంద్ర ప్రభుత్వం అటకెక్కించింది. ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పలు మా ర్లు విజ్ఞప్తి చేస్తూవస్తున్నా పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలోని 33జిల్లాల్లో హైదరాబాద్‌ను మినహాయిస్తే మిగిలిన 32జిల్లాల్లో సగానికిపైగానే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తటం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం, కరీంనగరలో ట్రిపుల్ ఐటి, ఐఐఎం ఏర్పాటు ,కొత్తజిల్లాలకు నవోదయ విద్యాలయాల మంజూ రు, చట్టబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు తెల్చటంలో కూడా నాన్చుపుధోరణితో వుంది.
అసెంబ్లీ తీర్మానాలు అమోదించాలి:
ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ రిజర్వేషన్ల పెంపుదల కోసం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపినా, వాటిని ఎటు తేల్చకుండా పెండింగ్‌లో పెట్టింది. ఎస్సీల వర్గీకరణ వెంటనే తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. 202021జన గణనలో కులాల వారీగా బిసిల జనాభా లెక్కలు సేకరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసికేంద్రానికి పంపింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. దేశ జనాభాలో మెజారిటీ బిసి కులాల కోసం కేంద్రంలో ఒక మంత్రిత్వశాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యంమంత్రి కెసిఆర్ అనేకసార్లు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు.
రాష్ట్రంలో గిరిజనులు , మైనారిటీల జనాభా సంఖ్యకు అనుగుణంగా వారి రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ముస్లిం రిజర్వేషన్లను బిసిఈ కోటా కింద 4శాతం నుంచి 12శాతానికి , గిరిజనులకు 6నుంచి 10శాతానికి రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్రం పంపిన ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉంది. ధాన్యం కొనుగోలు అంశం కూడా కేంద్రం వైఖరి కారణంగా రైతులు ఆగ్రహంతో ఉన్నారు . యాసంగిలో పండించిన ధాన్యమంతటినీ కేంద్రం కొనుగోలు చేసేందుకు ఇప్పుడు స్పష్టమన విధానం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసిన నివేదికను హోమంత్రికి అందజేయనున్నారు.