Monday, December 23, 2024

సమతామూర్తి సాక్షిగా.. ‘సంక్షేమ’ సంతకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సెక్రటేరియట్ ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్ట్ ఉద్యోగులకు, పేదలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సిఎం కెసిఆర్ పలు ఫైళ్లపై సంతకాలు చేయడంతో ఉద్యోగులతో పాటు పేదలకు లబ్ధి చేకూరనుంది. దళితబంధు పథకం 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో దళితబంధును అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1,100 లబ్ధిదారుల చొప్పున దళితబంధు పథకాన్ని వర్తింపచేసే ఫైలుపై సిఎం సంతకం చేశారు. పోడుభూముల పట్టాల పం పిణీకి సంబంధించిన ఫైలుకు సంబంధించి సి ఎం రెండో సంతకం చేయగా, మే నెల నుంచి జిల్లాలవారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. తద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్ష ల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు.

సిఎంఆర్‌ఎఫ్ నిధులకు సంబంధించిన ఫైలు మీద సిఎం కెసిఆర్ మూ డో సంతకం చేయగా, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ కు సంబంధించిన ఫైలుపై నాలుగో సంతకం, రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైలుమీద ఐదో సంతకం ముఖ్యమంత్రి చేశారు. పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి ఆరో సంతకం చేసి నూతన సచివాలయ భవనంలో మొదటిరోజు తన బాధ్యతలను నిర్వర్తించారు. ఉద్యోగుల రెగ్యులరైజ్ ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేయడంతో 40 విభాగాల్లోని 5,544 కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో 2,909 జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు (ఓకేషనల్), 390 మంది పాలిటెక్నికల్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మంది వైద్య సహాయకులు, వైద్యశాఖలో 179 ల్యాబ్ టెక్నీషియన్, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు…

రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి ఆదివారం సంతకం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనివల్ల 6.84 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందనున్నాయి. పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం ఈ కిట్‌ను అందించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా గర్భిణులకు ప్రొటీన్లు, ఖనిజ లవణాలతో కూడిన కిట్‌ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కిట్‌లో కిలో ఖర్జూరాలు, ఐరన్ సిరప్ రెండు బాటిళ్లు, నెయ్యి 500 గ్రాములు, అల్బెండజోల్ ట్యాబెట్లు ఒక కప్పు, హార్లిక్స్ రెండు బాటిళ్లు ఈ కిట్‌లో ఉండనున్నాయి. రూ.2వేల విలువ చేసే ఈ కిట్‌ను ప్రభుత్వం గర్భిణులకు ఉచితంగా అందిస్తుంది. 5వ నెల, 9వ నెలల్లో మొత్తం రెండుసార్లు కెసిఆర్ కిట్లను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యం గా ప్రభుత్వం పెట్టుకుంది.

మంత్రులకు సంబంధించిన వివరాలు ఇలా…

సిఎం కెసిఆర్ సంతకాలు చేస్తున్న సమయంలోనే మిగతా మంత్రులు కూడా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. మంత్రి కెటిఆర్- జీహెచ్‌ఎంసి పరిధిలో డబుల్ బెడ్రూంల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయగా, హరీష్‌రావు -టీచింగ్ ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ భర్తీకి సంబంధించిన దస్త్రంపై, తలసాని శ్రీనివాస్ యాదవ్ -ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ దస్త్రంపై, నిరంజన్ రెడ్డి సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరాకు సంబంధించి, గంగుల కమలాకర్ ఐసిడిఎస్ పథకంలో భాగంగా అంగన్‌వాడీలకు మే నెల నుంచి పోషకాల సన్నబియ్యం అందించే దస్త్రంపై, కొప్పుల ఈశ్వర్ -దళితబంధు రెండోవిడత దస్త్రంపై, ఇంద్రకరణ్ రెడ్డి – జీహెచ్‌ఎంసీ పరిధిలోని దేవాలయాల్లో దూప,దీప, నైవేధ్య ప్రారంభానికి సంబంధించిన దస్త్రంపై, జగదీశ్ రెడ్డి -వ్యవసాయ రంగానికి విద్యుత్ సబ్సిడీపై, సబితా ఇంద్రారెడ్డి -ట్యాబ్‌లు, లైబ్రరీ కార్నర్‌పై, సత్యవతి రాథోడ్ రాంజీ గోండు మ్యూజియానికి రూ. 10 కోట్ల కేటాయింపునకు సంబంధించి, శ్రీనివాస్ గౌడ్ సిఎం కప్ నిర్వహణకు రూ. 3.2 కోట్ల మంజూరుకు సంబంధించి, మహమూద్ అలీ – కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై, వేముల ప్రశాంత్ రెడ్డి -రోడ్లు, భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణపై, మల్లారెడ్డి శ్రమశక్తి అవార్డులకు సంబంధించి, దయాకర్ రావు ఐకేపీ గ్రూపులకు మండలాల వారీగా కొత్త భవనాల దస్త్రంపై సంతకాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News