మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి సిఎం హోదాలో తొలిసారి నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు కోస్గీ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిఎం శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.
మక్తల్ , నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి రూ.2945 కోట్లు మంజూరు చేసింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటా రు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా ఇదివరకే తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినా వివిధ కారణాలతో చివరి నిమిషంలో రెండు సార్లు వాయిదా పడింది. శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డితోపాటు స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.