Wednesday, December 18, 2024

రూ.10లు అదనంగా చెల్లిస్తేనే సిఎన్‌జి గ్యాస్ ! … పలుచోట్ల నో స్టాక్ బోర్డులు

- Advertisement -
- Advertisement -

గ్యాస్ బంకులకు నిరంతరం సరఫరా కానీ సిఎన్‌జి గ్యాస్..
అవకతవకలపై దృష్టి సారించని అధికారులు
క్యూలో ఉన్న వాహనదారులకే గ్యాస్

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎన్‌జి గ్యాస్‌ను (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) డీలర్‌లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో గ్యాస్ కొరత ఏర్పడుతుండడంతో ఆటోలు, కార్లు తదితర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ప్రతి బంక్‌లో అదనంగా రూ.10లను వసూలు చేస్తుండడంతో ఆయా వాహనాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రేటర్ పరిధిలో సుమారుగా 80 వరకు సిఎస్‌జీ బంక్‌లు ఉండగా ఎప్పటికప్పుడు ఆయా సిఎన్‌జీ బంకుల్లో గ్యాస్ నింపుకోవడానికి ఆటోలు క్యూ కడుతుంటాయి. ఆటోలతో పాటు మిగతా గ్యాస్ వాహనాల క్యూ కూడా ఉంటుంది. ఈనేపథ్యంలోనే పలువురు సిఎన్‌జీ యజమానులు గ్యాస్ కొరతను సృష్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్‌ను బ్లాక్ చేయడంతో పాటు నో స్టాక్ బోర్డులు పెడుతుండడంతో ఆటోలు నడిపే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ బంక్‌లకు గ్యాస్‌ను సరఫరా చేసే భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రతిరోజు గ్యాస్‌ను తీసుకెళ్లే కాంట్రాక్టర్ సరిపడా వాహనాలను సమకూర్చడంలో విఫలమయిన నేపథ్యంలో కృత్రిమ కొరత జరుగుతుందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
5 నుంచి 6 గంటల పాటు క్యూ
దీంతోపాటు ఈ కృత్రిమ కొరత వల్ల అధికంగా ఆదాయం సమకూరుతుండడంతో ఇదే అదునుగా ప్రతిసారి ఈ పద్ధతినే కాంట్రాక్టర్ అవలంభిస్తుండడం, దీనికి బంక్ యజమానులు వత్తాసు పలుకుతుండడంతో గ్యాస్ వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు కిలో గ్యాస్‌కు ప్రస్తుతం రూ.95ల వరకు ధర పలుకుతుండగా దానికి అదనంగా రూ.10లు ఎక్కడతే అదనంగా చెల్లిస్తారో ఆయా బంకుల్లో గ్యాస్ కొరత రాకుండా కాంట్రాక్టర్ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రతి వాహనానికి గ్యాస్‌ను నింపించినప్పుడు కిలో గ్యాస్‌లో తేడా వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. దీంతోపాటు సిఎన్‌జీ బంకుల్లో తనిఖీలను అధికారులు చేపట్టకపోవడంతో ఆయా బంకుల యజమానులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. చాలా బంకుల్లో ప్రస్తుతం గ్యాస్‌ను నింపుకోవాలంటే 5 నుంచి 6 గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తుందని ఆటోడ్రైవర్లు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 2 లక్షల సిఎన్‌జీ కార్లతో పాటు వివిధ వాహనాలు ఉండగా, ఒక లక్ష వరకు ఆటోలు సిఎన్‌జీతో నడుస్తున్నాయి. కాలుష్యం తక్కువగా ఉండటం. మైలేజ్ ఎక్కువగా ఒస్తుందటం, ధర తక్కువగా ఉండడంతో వాహనదారులు సిఎన్‌జీ వైపు మొగ్గు చూపుతున్నారు.
అధికారులు ఒకసారి ఈ బంక్‌లపై దృష్టి సారించాలి:
ఏ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం సమాఖ్య ప్రతినిధి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిఎన్‌జీ గ్యాస్ దొరక్క వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గ్యాస్ నింపుకున్న ప్రతి వాహనదారుని వద్ద రూ.5 నుంచి రూ.10లు వసూలు చేస్తున్నారు. పైగా నగరంలో సేవలు అందిస్తున్న గ్యాస్ ఏజెన్సీల ధరల విషయంలోనూ వ్యత్యాసం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆయా నగరాలను బట్టి అన్ని బంకుల్లో ఒకే రేటు ఉండగా, గ్యాస్ రేట్లలో ఎందుకు తేడా ఉందో అధికారులు ఒకసారి సమీక్షించాలి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరతను తీర్చడంతో పాటు రేట్ల వ్యత్యాసాన్ని సవరించాలి.
మాకు అప్పులు తప్ప మిగిలేది ఏమీలేదు:
తెలంగాణ రవాణారంగ కార్మికుల ఐక్యసమితి కన్వీనర్ శాభన్‌కార్ దయానంద్
కొత్త విధానాలను సిఎన్‌జీ గ్యాస్ బంకులు అమలు చేస్తున్నాయి. గ్యాస్ నింపిన ప్రతి వాహనదారుడి నుంచి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నాయి. ఇదేమని అడిగితే వాహనదారులకు గ్యాస్ ఇవ్వడం లేదు. పెట్రోల్, డీజిల్ భారం భరించలేక సిఎన్‌జీ గ్యాస్ వాహనాలను కొనుగోలు చేస్తే మాకు అప్పులు తప్ప మిగిలేది ఏమీలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటోడ్రైవర్‌ల సమస్యపై దృష్టి సారించి అందరికీ మేలు జరిగేలా చర్యలు చేపట్టాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News