Monday, December 23, 2024

కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం లోని వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతోపాటు వారికి సరైన సౌకర్యాలు కల్పించడం, బోధనా విధానాలు మెరుగుపర్చడం, అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా శిక్షణా కేంద్రాలకు అనేక సూచనలు చేసింది. సెకండరీ పాఠశాల విద్య పూర్తి చేసిన వారిని మాత్రమే కోచింగ్ కోసం పేరు నమోదు చేసుకునేందుకు అనుమతించాలి. 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోకూడదు.శిక్షణ కేంద్రాల్లో అర్హులైన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు , వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్ తదితర సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.

కోచింగ్ సెంటర్‌లో శిక్షణకు సంబంధించి , అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు చాలినంత స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు, సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే , గుర్తింపు రద్దవుతుంది. ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్ చేయాలి. కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌తోపాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. జాతీయ విద్యావిధానం 2020 (ఎన్‌ఇపి) కి అనుగుణంగా కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి విద్యావిధానంలో మార్పులు చేసింది.

అందులో భాగంగా దేశం లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి) ను నిర్వహిస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచి 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తోంది. మరోవైపు నీట్, జేఈఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ) నేషనల్ టెస్ట్ అభ్యాస్ పేరుతో మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. దీని ద్వారా విద్యార్థులకు ఉచితంగా నమూనా పరీక్షలను నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News