గనుల సందర్శనలో కేంద్ర మంత్రి
ఛత్రా (జార్ఖండ్) : కొన్ని బొగ్గుగనుల ప్రాంతాలలో వరదలతోనే బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడిందని బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇక్కడ తెలిపారు. ఎడతెరిపి లేని వానలతో బొగ్గు గనులలో పనులు నిలిచిపొయ్యాయి. దీనితో సరఫరా దెబ్బతింది. అంతేకానీ బొగ్గు గనుల నిల్వలకు ఎటువంటి ముప్పు లేదని, పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందని తెలిపారు. విద్యుత్ సంక్షోభం వార్తలపై ఆయన స్పందించారు. జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలోని పిపర్‌వార్ ప్రాంతంలో ఉన్న కేంద్ర బొగ్గు గనుల క్షేత్రాల కంపెనీ (సిసిఎల్)లోని అశోకా మైన్స్‌ను మంత్రి గురువారం సందర్శించారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇంతకు ముందటి మాదిరిగానే బొగ్గు సరఫరా జరుగుతుందని, ఎటువంటి లోపం తలెత్తబోదని విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు కలుగకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో బొగ్గు సరఫరాలో అంతరాయంతో విద్యుత్ ఉత్పాదన పడిపోవడంతో బ్లాకౌట్ పరిస్థితులు తలెత్తాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ దశలో బొగ్గు మంత్రి క్షేత్రస్థాయిలో గనుల పరిస్థితిని సమీక్షించేందుకు సంకల్పించారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన విలేకరుల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇక్కడికి వచ్చిన మంత్రి సెంట్రల్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ అధికారులతో చర్చలు జరిపారు. ఇప్పటికైతే రోజుకు 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు అని, అయితే మరింత ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వర్షాలతో బొగ్గు గనులు మూతపడ్డాయి. కొన్నింటిలోకి వరద నీరు చేరడం ఇతర కారణాలతో సరఫరా జాప్యం ఏర్పడిందని పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు. ఇక్కడ గనుల విస్తరణకు సంబంధించి భూముల స్వాధీన సమస్య ఉంది. సంబంధిత విషయంపై జిల్లా అధికారులతో మంత్రి చర్చలు జరిపారు. పరిస్థితి సవ్యంగా పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.