టాంజానియా, కేప్‌టౌన్ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి స్వాధీనం
ట్రాలీబ్యాగ్ అడుగు భాగంలో పెట్టి తరలిస్తుండగా పట్టివేత
మన తెలంగాణ/శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి సుమారుగా రూ.80 కోట్ల విలువైన కొకైన్‌ను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా, కేప్‌టౌన్ నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణీకులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 4 కేజీల చొప్పున కొకైన్ బయటపడిందని తెలిపారు. కొకైన్ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమా చారం అందడంతో నిఘా పెట్టి తనిఖీ చేశామని అధికారులు వెల్లడించారు. కాగా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు 350 కిలోల కొకైన్ పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో పట్టుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.