పని గంటలు, ఒటిలు, లీవులు, భద్రత కార్మికుల హక్కులలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్ల ద్వారా విస్తృతంగా మినహాయింపు ఇచ్చే అధికారాన్ని యాజమాన్యానికి ఇవ్వ డం అత్యంత ప్రమాదకరమని గత సంవత్సరం కరోనా సమయంలో తేలింది. ఒక నియమం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలకు ఉత్పత్తి ప్రారంభమైన దగ్గర నుండి తాము అనుకున్నన్ని సంవత్సరాల పాటు ఈ హక్కులన్నింటికీ మినహాయింపు ఇచ్చే అధికారం ఉంది. గత కాలంలో ఫ్యాక్టరీల చట్టం ఇటువంటి అధికారం ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ ‘బాల కార్మిక వ్యవస్థ, కట్టుబానిసత్వం రద్దు చట్టాల మినహాయింపుతో’ కుదించి నాలుగు చట్టాలుగా మార్చింది. ఈ చట్టాలే కోడ్‌లుగా పిలువబడుతున్నాయి. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం పొందిన కోడ్‌లకు నిబంధనలు కూడా సిద్ధమైనాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని స్వీకరించగానే అమల్లోకి వస్తాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే వాటికి మార్గం సుగమం అవుతుంది.
“లేబర్ కోడ్‌లు సిద్ధం చేశాం. వ్యవసాయ చట్టాలు తెచ్చాం. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ పూర్తి చేస్తున్నాం. విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచాం. ఇక మీదే ఆలస్యం’ అంటూ ఈ దేశంలో దోపిడీకి దేశ, విదేశీ పెట్టుబడులకు మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం విసిరిన ఈ సవాల్‌ను స్వీకరించాలి. లేబర్ కోడ్‌లలో పొంచి ఉన్న ప్రమాదం గురించి ప్రచారం చేయాలి. కార్మికులను చైతన్యం చేసి సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో కొద్ది కాలం పాటు మాత్రమే ఉండే ఉద్యోగాలు ‘ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్’ ప్రవేశిస్తాయి. పారిశ్రామిక సంబంధాల్లో ఇది ఒక పెద్ద ప్రక్షాళన కానుంది. ప్రభుత్వ శాఖలు మినహా ప్రభుత్వ, ప్రైవేటు రంగమంతటా ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌ను పారిశ్రామిక సంబంధాల కోడ్ సార్వత్రికం చేసింది.
నేరుగా కార్మిక చట్టాల అమలుకు అవకాశంలేని ప్రభుత్వ శాఖల్లో సంబంధిత ప్రభుత్వాల నోటిఫికేషన్లు లేదా సర్వీస్ నిబంధనల మార్పు ద్వారా ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ఉన్న పర్మినెంట్ ఉద్యోగాలను ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌గా మార్చకూడదనే నియమం పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో లేదు. పర్మినెంట్ ఉద్యోగాలు క్రమేపీ కనుమరుగయ్యే పెను ప్రమాదం పొంచి ఉంది. ఇక నుండి కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. వారితో పాటు కాంట్రాక్ట్ వ్యవస్థ అవసరం కూడా ఉండదు. భద్రత లేని, అనిశ్చిత తరహా ఉద్యోగాలు మాత్రమే ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌లో వుంటాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న ఈ సమయంలో పెట్టుబడిదారులకు భద్రత కల్పించి, కార్మికులను అభద్రతలోకి నెట్టి వేయడానికి పాలకవర్గాలు తీసుకొచ్చిన సాధనమే ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ అంటారు.
పారిశ్రామిక సంబంధాల కోడ్ సమ్మెలు చేయడాన్ని కష్టతరం చేసింది. ఇంతకు మునుపు చట్టాల్లో ప్రజోపయోగ సర్వీసుల్లో మాత్రమే తప్పని సరిగా పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీసునివ్వాలి. మిగతా వాటిలో అప్పటికప్పుడు సమ్మెకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త కోడ్ ప్రకారం అన్నింటిలోనూ పద్నాలుగు రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా సమ్మెలోకి పోవడం చట్టవ్యతిరేకం. అవసరమైనప్పుడు పనిలో పెట్టుకోవడం, అవసరం లేనప్పుడు పనిలో నుండి తీసేసే “హైర్ అండ్ ఫైర్” పద్ధతిని పారిశ్రామిక సంబంధాల కోడ్ అమల్లోకి తెచ్చింది. అంతకు ముందు వందా లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు వున్న యజమానులు తమ పరిశ్రమలు, సంస్థల మూసివేతలకు, కార్మికుల తొలగింపుకు, లే ఆఫ్‌లకు ప్రభుత్వ అనుమతి అవసరం ఉంది.
కొత్తచట్టంలో దాన్ని మూడు వందలకు పెంచారు. మూడు వందల లోపు కార్మికులు వున్న చోట ఈ మూడు పనులకు యజమానులు అనుమతులు పొందనవసరం లేదు. మరింత ముఖ్యం గా మూడు వందల సంఖ్యను సంబంధిత ప్రభుత్వాలు పార్లమెంట్ లేదా అసెంబ్లీలలో చట్టాల్లో మార్పు చేయకుండానే నోటిఫికేషన్ ద్వారా ఎంతకైనా పెంచే అధికారాన్ని పారిశ్రామిక సంబంధాల కోడ్ ఇచ్చింది. కార్మికులు ఎంత మంది ఉన్నా సరే మూసివేతలు, తొలగింపులకు ప్రభుత్వ అనుమతి లేకుండానే యాజమానుల ఇష్టారాజ్యం అవుతుంది.
భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లో ఇంతకు ముందు చట్టాల్లో ఉన్న పని పరిస్థితులు దాదాపుగా యథాతథంగా ఉన్నాయి. ముఖ్యంగా రోజు పని గంటలు, వారం పని గంటలు, ఒటిలు, సెలవులు, లీవులు కొత్త కోడ్‌లో కూడా కొనసాగుతాయి. భద్రత, ఆరోగ్యానికి సంబంధించి యజమానుల బాధ్యతకు సంబంధించిన నియమాలు కూడా దాదాపుగా కొత్త కోడ్‌లో కొనసాగుతాయి. కానీ ఈ కోడ్‌లోని ఏదైనా ఒక నియమం లేదా అన్ని నియమాల నుండి మినహాయింపులను ఒక పరిశ్రమ లేదా ఒకే తరహా పరిశ్రమలు లేదా ప్రాంతాలకు ఇచ్చే అధికారాలను ఈ కోడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. కార్మికుల హక్కులన్నిట్లోను పని గంటలు, ఒటిలు, లీవులు, భద్రత ముఖ్యమైన భాగాలు.
నోటిఫికేషన్ల ద్వారా వీటికి విస్తృతంగా మినహాయింపునిచ్చే అధికారాన్ని యాజమాన్యానికి ఇవ్వడం ప్రమాదకరమని పోయిన సంవత్సరం కరోనా సమయంలో తేలింది. ఇంతకు ముందు ఎన్నడూలేని విధంగా ఈ మినహాయింపులు మూడు రకాలుగా ఉంటాయి. ఒక నియమం ప్రకారం అన్నిటికీ సాధారణ మినహాయింపు ఇచ్చే అధికారం ఉంది. ఇంతకు ముందు చట్టాల్లో ఇది లేదు. మరొక నియమం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలకు ఉత్పత్తి ప్రారంభమైన దగ్గర నుండి తాము అనుకున్నన్ని సంవత్సరాల పాటు ఈ హక్కులన్నింటికీ మినహాయింపు ఇచ్చే అధికారం ఉంది. ఇంతకు ముందు ఫ్యాక్టరీల చట్టం ఇటువంటి అధికారం ఇవ్వలేదు.
మూడో నియమం ప్రత్యేక పరిస్థితులకు సంబంధించినది. ఫ్యాక్టరీల చట్టం ప్రకారం పబ్లిక్ ఎమర్జెన్సీ ‘ప్రజా అత్యవసర పరిస్థితి’లో మాత్రమే యజమానులకు ఈ నిబంధనల అమలు నుండి మినహాయింపు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ లేదా అంతర్గత అల్లర్ల వలన దేశం లేదా దేశంలోని ఒక ప్రాంత భద్రతకు ప్రమాదం రావడాన్ని పబ్లిక్ ఎమర్జెన్సీగా నిర్వచించారు. దీనికి విరుద్ధంగా కరోనా సమయంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కోర్టులు కొట్టేశాయి. ఇప్పుడు కొత్త కోడ్‌లో పబ్లిక్ ఎమర్జెన్సీతో పాటు మహమ్మారి జబ్బులు, విపత్తులను కూడా చేర్చారు. కానీ ఆఖరి రెండింటికీ నిర్వచనం ఇవ్వలేదు. ఫ్యాక్టరీల చట్టం ప్రకారం పబ్లిక్ ఎమర్జెన్సీలో ఈ మినహాయింపు ఫ్యాక్టరీలకు మాత్రమే పరిమితం. కానీ కొత్త కోడ్‌లో అదీ, ఇదీ అని లేకుండా అన్ని పని ప్రదేశాలకు మినహాయింపులను వర్తింపజేశారు. కార్మికుల శాశ్వత బానిసత్వానికి పునాది వేశారు.
ఫైనాన్స్ రంగ సంస్కరణలలో నూతన పెన్షన్ పథకం, మెడికల్ ఇన్సూరెన్స్ పథకాలు ముఖ్యమైన భాగాలు. విదేశీ, స్వదేశీ ఫైనాన్స్ పెట్టుబడులకు తక్షణ లాభాలు కల్పించడమే పాలక వర్గాల లక్ష్యం. సామాజిక భద్రతా కోడ్‌లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఇ.ఎస్.ఐ లు అంతకు ముందు ఉన్న విధంగానే కొనసాగాయి. కానీ 12 % ఉన్న పి.ఎఫ్ 10 % తగ్గింది. ఈ పథకాలను పార్లమెంట్ ఆమోదం లేకుండానే తాను అనుకున్నప్పుడు మార్చే అధికారాన్ని కోడ్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇపిఎఫ్, ఇపిఎస్, ఇ.ఎస్.ఐలలోని సుమారు రూ.12 లక్షల కోట్లను నూతన పెన్షన్ స్కీమ్‌లోకి, మెడికల్ ఇన్సూరెన్స్ స్కీముల్లోకి మార్చి విదేశీ పెట్టుబడుల సేవలో తరించాలని మోడీ ప్రభుత్వం భావించింది. ఇ.పి.ఎఫ్‌ను ఎత్తివేసి నూతన పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశ పెట్టాలన్న మోడీ ప్రభుత్వ ప్రతిపాదనను అదివరలో కార్మిక సంఘాలు తిరస్కరించాయి.
ఇ.ఎస్.ఐ కు బదులుగా కార్మికులకు నష్టం చేసే మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రతిపాదనను కూడా కార్మిక సంఘాలు తిప్పికొట్టాయి. కానీ మోడీ ప్రభుత్వం అంతటితో ఊరుకోకుండా దొడ్డిదారిన కోడ్ ద్వారా ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ పథకాల్లో మార్పు చేసే అధికారం తీసుకుంది. షేర్ మార్కెట్‌లో ఫైనాన్స్ పెట్టుబడుల తక్షణ లాభాలకు కార్మికుల ఇ.పి.ఎఫ్.ను బలిపెడుతోంది. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల వాటాను మోడీ ప్రభుత్వం 74% పెంచిన తర్వాత ఇ.ఎస్.ఐ కి ప్రమాదం పొంచి ఉంది. లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమానులకు కార్మికులు కట్టు బానిసలుగా మారుస్తాయి. ప్రమాదకరమైన ఈ లేబర్ కోడ్‌లు రద్దయ్యేంత వరకూ పోరాడాలి.